Hathras stampede : జరగబోయేదాన్ని ఎవరు ఆపగలరు - భోలే బాబా
వచ్చినవారు వెళ్లిపోవాల్సిందే అంటూ వేదాంతం;
హాథ్రస్‌లో సత్సంగ్ నిర్వహించిన భోలే బాబా ప్రస్తుతం కాస్‌గంజ్‌లో ఉన్న ఆశ్రమానికి తిరిగి వచ్చారు. ఈ ఘటన తర్వాత చాలా బాధపడ్డారని, మరణించిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. జరిగే దానిని ఎవరూ ఆపలేరని, వచ్చిన వారు ఏదో ఒక రోజు వెళ్లిపోవాల్సిందేనంటూ హాథ్రస్ తొక్కిలాస ఘటనపై భోలే బాబా తాజాగా స్పందించారు. ఈ ఘటన జరిగిన 15 రోజుల తర్వాత భోలే బాబా కాస్‌గంజ్‌లో ఉన్న తన ఆశ్రమానికి తిరిగి వచ్చారు. ఈ క్రమంలోనే పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు.
'జులై 2న జరిగిన హాథ్రస్ తొక్కిలాసట ఘటన తర్వాత నేను బాధపడ్డా. కానీ, జరిగే వాటిని ఎవరు ఆపగలరు? వచ్చిన వారు ఏదో ఒకరోజు వెళ్లిపోవాల్సిందే. సమయం మాత్రమే తెలీదు. అక్కడ విషపూరిత స్ప్రే గురించి మా న్యాయవాది, ప్రత్యక్ష సాక్షులు చెప్పింది నిజమే. ఆ ఘటన వెనుక ఏదో కుట్ర దాగి ఉన్న విషయం మాత్రం వాస్తవం. సనాతనంగా, సత్యం ఆధారంగా నడిచే మా సంస్థ పరువు తీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. సిట్, జ్యుడీషియల్ కమిషన్‌పై మాకు పూర్తి విశ్వాసం ఉంది. నిజం బయటకు వస్తుంది. ఈ ఘటనలో మరణించిన వారందరి కుటుంబాలకు మేము అండగా ఉంటాం. ప్రస్తుతం నా జన్మస్థలమైన కాస్‌గంజ్‌లోని బహదుర్నగర్లో ఉన్నా' అని భోలే బాబా తెలిపారు.
భోలే బాబా తన ఆశ్రమానికి వచ్చేశారని, ఇక్కడే ఉంటారని ఆయన తరఫు న్యాయవాది ఏపీ సింగ్ తెలిపారు. 'భోలే బాబా కాస్‌గంజ్‌లో ఉన్న ఆశ్రమానికి తిరిగి వచ్చారు. ఇక్కడే ఉంటారు. ఏ హోటల్‌లోనో, మరే దేశంలోనో ఆయన దాక్కోలేదు. ఆయన మరో ఆశ్రమం నుంచి ఇక్కడికి వచ్చారు' అని భోలే బాబా తరఫు న్యాయవాది ఏపీ సింగ్ మీడియాతో అన్నారు.
హాథ్రస్ తొక్కిలాసట దుర్ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం, దీని వెనక కుట్ర జరిగిందనే విషయాన్ని తోసిపుచ్చలేమని అనుమానం వ్యక్తం చేసింది. జులై 9 ప్రభుత్వానికి అందించిన నివేదికలో ఈ విషయాన్ని పేర్కొంది. తొక్కిసలాటకు దారితీసిన కారణాల్లో స్థానిక యంత్రాంగం తప్పిదాన్ని ఎత్తిచూపింది.