బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఒక కీలక ప్రకటన చేశారు. ఇకపై బీహార్ లో నెలకు 125 యూనిట్ల లోపు కరెంటు వినియోగించే గృహ వినియోగదారులు ఎటువంటి బిల్లులు చెల్లించనక్కర్లేదన్నారు. ఈ పథకం ఆగస్టు 1, 2025 నుండి అమలులోకి వస్తుంది. అంటే, జూలై నెల విద్యుత్ బిల్లుల నుండే ఈ మినహాయింపు వర్తిస్తుంది.ఈ నిర్ణయంతో బీహార్ లోని మొత్తం 1.67 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని అంచనా.నిరుపేద మరియు మధ్యతరగతి కుటుంబాలపై విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించి, వారికి ఆర్థికంగా సహాయపడటమే లక్ష్యంగా ఈ పథకాన్ని నితీష్ ఫ్రభుత్వం తీసుకువచ్చింది. నితీష్ కుమార్ ఉచిత విద్యుత్ పథకంతో పాటు, సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించడానికి మరికొన్ని పథకాలను కూడా ప్రకటించారు.
సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు: రాబోయే మూడు సంవత్సరాలలో గృహ వినియోగదారుల సమ్మతితో వారి ఇంటి పైకప్పులపై లేదా సమీపంలోని బహిరంగ ప్రదేశాలలో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
కుటీర్ జ్యోతి యోజన: ఈ పథకం కింద, చాలా పేద కుటుంబాలకు సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు ఖర్చును ప్రభుత్వం పూర్తిగా భరిస్తుంది. మిగిలిన గృహ వినియోగదారులకు తగిన సహాయం అందిస్తుంది.
పునరుత్పాదక ఇంధన లక్ష్యం: రాబోయే మూడు సంవత్సరాలలో 10,000 మెగావాట్ల సౌరశక్తిని ఉత్పత్తి చేయాలని బీహార్ లక్ష్యంగా పెట్టుకుంది.