BIHAR: బిహార్‌కు కాబోయే ముఖ్యమంత్రి ఎవరు?
రాజకీయ వేదికలకు సిద్ధమైన బిహార్
బిహార్ రాజకీయాల్లో చారిత్రక మార్పులకు వేదిక సిద్ధమైంది. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పాలన సాగించిన నీతీశ్‌కుమార్ త్వరలో రాజ్యసభకు వెళ్లనుండటంతో, ఆ రాష్ట్రంలో తొలిసారిగా సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ఈ పరిణామంతో కమలం పార్టీ నుంచి తదుపరి ముఖ్యమంత్రి పగ్గాలు ఎవరు చేపడతారనే అంశంపై జాతీయ స్థాయిలో ఉత్కంఠ నెలకొంది. సామాజిక సమీకరణాలను బేరీజు వేస్తూ, బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చేలా అధిష్టానం అడుగులు వేస్తోంది.
ముఖ్యమంత్రి రేసులో ప్రస్తుతం ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌధరీ పేరు బలంగా వినిపిస్తోంది. ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయనను పెద్ద నాయకుడిని చేస్తామని గతంలో అమిత్ షా స్వయంగా ప్రకటించడం విశేషం. అయితే ఆయన ఆర్జేడీ నుంచి వచ్చి పదేళ్లు కూడా పూర్తి కాకపోవడం కొంత చర్చకు దారితీస్తోంది. మరోవైపు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ పేరు కూడా పరిశీలనలో ఉంది. ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ నేపథ్యం ఉన్న ఆయన, రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన యాదవ సామాజిక వర్గానికి చెందినవారు. కాకపోతే ఆయనకు అవకాశం ఇస్తే ఇతర వెనుకబడిన వర్గాల నుంచి వ్యతిరేకత రావచ్చనే సందేహాలు పార్టీ వర్గాల్లో ఉన్నాయి.
వీరితో పాటు అగ్రవర్ణాలకు చెందిన మంగళ్ పాండే, అత్యంత వెనుకబడిన వర్గాల ప్రతినిధిగా సంజీవ్ చౌరాసియా పేర్లు కూడా జాబితాలో ఉన్నాయి. వెస్ట్ చంపారన్ ఎంపీ సంజయ్ జైస్వాల్, ఉప ముఖ్యమంత్రి విజయ్ సిన్హా సైతం ఈ పదవి కోసం పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ అధినాయకత్వం ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవైపు సామాజిక వ్యూహం, మరోవైపు పార్టీ పట్ల విధేయతను పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.అంతేకాకుండా ఈ కొత్త రాజకీయ సమీకరణాల్లో భాగంగా నీతీశ్ కుమారుడు నిశాంత్ కుమార్‌కు ఉపముఖ్యమంత్రి పదవి దక్కవచ్చనే ప్రచారం కూడా జోరందుకుంది. ఒకవేళ ఇదే జరిగితే బిహార్ రాజకీయాల్లో ఇదొక కొత్త మలుపు అవుతుంది. అటు నీతీష్ వర్గాన్ని సంతృప్తి పరుస్తూనే, ఇటు రాష్ట్రంలో బీజేపీ తన పట్టును బలపరుచుకునేలా ప్రణాళికలు రచిస్తోంది. బిహార్‌లో సామాజిక సమీకరణాలను సమతూకం చేస్తూనే, రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ ఈ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ మార్పుతో రాష్ట్ర రాజకీయాల్లో దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న నీతీష్ శకం ముగిసి, కమలదళం నేతృత్వంలో కొత్త అధ్యాయం మొదలుకానుంది.