Economic Strain : బీహార్‌కు ఉచితాల భారం.. ఏటా రూ.33,000 కోట్ల ఖర్చు.. ఆర్థిక వ్యవస్థ తట్టుకుంటుందా?
Economic Strain : ఉచిత హామీలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఒక కొత్త ట్రెండ్‌గా మారాయి. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఈ ఉచిత పథకాలతో ఎన్నికల్లో భారీ విజయం సాధించాక, అన్ని పార్టీలు వీటిని పాటించడానికి పోటీ పడుతున్నాయి. తాజాగా ఎన్నికల్లో విజయం సాధించిన బీహార్‌లోని అధికార ఎన్‌డీఏ కూటమి కూడా అనేక ఉచిత పథకాలను ప్రకటించింది. అయితే భారతదేశంలోనే అత్యంత వెనుకబడిన రాష్ట్రాలలో ఒకటైన బీహార్ ఈ భారీ ఉచితాల భారాన్ని మోయగలదా అనే ప్రశ్న ఇప్పుడు ఆర్థిక నిపుణుల్లో చర్చనీయాంశమైంది.
బీహార్ ప్రభుత్వం ప్రకటించిన ఉచిత పథకాలను అమలు చేయడానికి ఏటా సుమారు రూ.33,000 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఖర్చు బీహార్ ఆర్థిక వ్యవస్థకు చాలా పెద్ద భారం. బీహార్ బడ్జెట్ సుమారు రూ.3 లక్షల కోట్ల నుంచి రూ.3.5 లక్షల కోట్ల మధ్య ఉంటుంది. రాష్ట్రానికి సొంతంగా వచ్చే పన్నుల ఆదాయం కేవలం రూ.54,300 కోట్లు మాత్రమే. గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ ఉచిత పథకాలకు అయ్యే ఖర్చు (రూ.33,000 కోట్లు) అనేది, రాష్ట్రం సొంతంగా సంపాదించే పన్నుల్లో దాదాపు 60%తో సమానం. ఇంత పెద్ద మొత్తాన్ని ఉచితాలకు ఖర్చు చేయడం వల్ల, అభివృద్ధి పనులకు డబ్బులు మిగలడం కష్టమవుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు, దీర్ఘకాలిక అభివృద్ధికి మూలధన వ్యయం చాలా ముఖ్యం. అంటే, రోడ్లు, వంతెనలు, ఆసుపత్రులు, విద్యుత్ కేంద్రాలు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెట్టే ఖర్చు అన్నమాట.బీహార్‌లో ఉచిత పథకాలకు కేటాయించిన మొత్తం, ప్రభుత్వ మొత్తం మూలధన వ్యయంలో దాదాపు 80% వరకు ఉంది.ఈ భారీ ఖర్చు వల్ల అభివృద్ధి పనులకు కేటాయించే నిధులకు కోత పడే అవకాశం ఉంది. అభివృద్ధి కోసం ఖర్చు చేయాల్సిన డబ్బు, ఉచితాల కోసం పోతే.. రాష్ట్ర ఆర్థిక వృద్ధి మందగిస్తుంది.
బీహార్ భారతదేశంలో అత్యంత వెనుకబడిన రాష్ట్రాలలో ఒకటి. ఇక్కడ పన్నుల ఆదాయం చాలా తక్కువ. బీహార్‌కు వచ్చే మొత్తం ఆదాయంలో ఎక్కువ భాగం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే వాటా పైనే ఆధారపడి ఉంటుంది. అంటే, కేంద్రం ఇచ్చే ఆర్థిక సహాయంతోనే బీహార్ తన రోజువారీ ఖర్చులను నెట్టుకొస్తుంది. ఇప్పటికే రూ.4 లక్షల కోట్ల కంటే ఎక్కువ అప్పు ఉన్న బీహార్ రాష్ట్రం, కేంద్రం సాయంపై ఆధారపడుతూ ఇంత భారీ ఉచిత పథకాలను ప్రకటించడం సరైనదేనా అనే ప్రశ్న తలెత్తుతోంది.
బీహార్‌లో హామీ ఇచ్చిన కొన్ని ప్రధాన ఉచిత పథకాలు:
* మహిళలకు రూ.10,000 ఆర్థిక సహాయం.
* 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.
* నిరుద్యోగులకు నెలకు రూ.1,000 భత్యం.
* వృద్ధాప్య పింఛను రూ.400 నుంచి రూ.1,100కి పెంచడం.
* భవన నిర్మాణ కార్మికులకు రూ.5,000 దుస్తుల భత్యం.
* జీవికా, అంగన్వాడీ, ఆశా కార్యకర్తల గౌరవ వేతనం పెంచడం.
కర్ణాటక వంటి రాష్ట్రానికి భారీ ఉచితాలు అమలు చేయడానికే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కర్ణాటకకు అధిక పన్ను ఆదాయాన్ని సృష్టించే శక్తి ఉంది. బెంగళూరు వంటి నగరాలతో బలమైన పారిశ్రామిక వాతావరణం ఉంది. అయినప్పటికీ, అక్కడ కూడా అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడానికి ప్రభుత్వం ఇబ్బంది పడుతోంది. ఆదాయం కోసం కేంద్రంపై ఆధారపడే, ఇప్పటికే భారీ అప్పులున్న బీహార్ వంటి రాష్ట్రం ఈ ఉచిత పథకాల భారాన్ని ఎలా మోయగలదు అనేది వేచి చూడాల్సిన విషయం.