మహారాష్ట్రలో హింస తలెత్తేందుకు అవకాశాలున్నాయంటూ ఎన్సీపీ-ఎస్పీ చీఫ్ శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తప్పుపట్టింది. శరద్ పవార్ వంటి సీనియర్ నేత నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వెలువడతాయని తాము ఊహించలేదని బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బావన్కులే అన్నారు. మహారాష్ట్రలో హింస, కుల ఘర్షణలు చోటు చేసుకోవచ్చని శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయని, రాష్ట్రానికి 40 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి నుంచి ఇలాంటి మాటలు తాను ఊహించలేదని చెప్పారు.
శరద్ పవార్ ఆదివారంనాడు ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో చేసిన కామెంట్స్ రచ్చ చేస్తున్నాయి. మణిపూర్లో జాతుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయని, అక్కడ హింసను పరిష్కరించడంలో కేంద్రం విఫలమైందని అన్నారు. మహారాష్ట్రలో కూడా మరాఠా రిజర్వేషన్ల కోసం నిరసనలు జరుగుతున్నాయని, మణిపూర్ తరహాలోనే ఇక్కడ కూడా హింసాత్మక ఘటనలు తలెత్తే అవకాశాలున్నాయని అన్నారు. అయితే ఎందరో మహనీయులు మహారాష్ట్రలో సామరస్యాన్ని పొంపొందించేందుకు కృషి చేసినందున అలాంటి ఘటనలు జరక్కపోవచ్చని అన్నారు. రిజర్వేషన్ల అంశంపై మరాఠా, ఓసీబీ కమ్యూనిటీల మధ్య అసంతృప్తులు పెరుగుతున్నందున మరాఠా యాక్టివిస్ట్ మనోజ్ జారంగే పాటిల్, ఓబీసీ నేతలతో ఏక్నాథ్ షిండే ప్రభుత్వం చర్చలు జరపాలని సూచించారు.
ఐతే.. పవార్ వ్యాఖ్యలపై చంద్రశేఖర్ బావన్కులే స్పందిస్తూ, మహారాష్ట్ర ప్రజలు హింసను ప్రోత్సహించరని, పవార్ కు ఆ అవిషయం తెలిసినప్పటికీ దిగజారుడు రాజకీయాలను ఆయన కోరుకుంటున్నారని అన్నారు. రాజకీయాల కోసం మహారాష్ట్రను, ప్రజలను పవార్ అప్రతిష్టపాలు చేస్తున్నారని అన్నారు. ఎలాంటి పరిస్థితినైనా అదుపు చేసే సామర్థ్యం దేవేంద్ర ఫడ్నవిస్ కు ఉందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం విపక్షంలోని కొందరు నేతలు అశాంతిని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారనేది నిజమని ఆయన అన్నారు.