BJP Leader Shot Dead: బీహార్‌లో బీజేపీ నేత కాల్చివేత
బైక్‌పై వచ్చి బీజేపీ నేత సురేంద్ర కేవత్‌ను కాల్చి చంపిన దుండగులు;
మరో బీజేపీ నేత హత్యకు గురయ్యారు. పొలం వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా బైక్‌పై వచ్చిన దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆ బీజేపీ నేతను హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. బీహార్ రాజధాని పాట్నాలో ఈ సంఘటన జరిగింది. బీజేపీ నేత సురేంద్ర కేవత్ శనివారం రాత్రి భోజనం తర్వాత షేక్‌పురా గ్రామంలోని పొలం వద్దకు బైక్‌పై వెళ్లారు. నీటి పంపును బంద్ చేసిన తర్వాత ఇంటికి తిరిగి వెళ్తున్నారు. బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు బీజేపీ నేత సురేంద్ర కేవత్‌పై గన్‌తో నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయారు.
కాగా, కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సురేంద్రను పాట్నాలోని ఎయిమ్స్‌కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులు జరిగిన సంఘటనా స్థలానికి ఫోరెన్సిక్ బృందం చేరుకుని ఆధారాలు సేకరించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
మరోవైపు ప్రముఖ వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కాను పాట్నాలోని ఆయన ఇంటి బయట కాల్చి చంపిన వారం తర్వాత బీజేపీ నేత సురేంద్రపై కాల్పులు జరిపి హత్య చేయడం కలకలం రేపింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి.