Budget 2026 : బంపర్ ఆఫర్..తగ్గనున్న విదేశీ వస్తువుల ధరలు..మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్.

Update: 2026-01-09 05:45 GMT

Budget 2026 : కేంద్ర బడ్జెట్ 2026కు రంగం సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే ఈ బడ్జెట్‌లో సామాన్యులకు, వ్యాపారవేత్తలకు భారీ ఊరటనిచ్చే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే వస్తువులపై విధించే కస్టమ్స్ డ్యూటీ విషయంలో మోదీ ప్రభుత్వం ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఈ మార్పుల వల్ల విదేశీ వస్తువుల ధరలు తగ్గడమే కాకుండా, వ్యాపార లావాదేవీలు మరింత సులభతరం కానున్నాయి.

ప్రస్తుతం భారతదేశంలో దిగుమతి చేసుకునే వస్తువులపై దాదాపు ఎనిమిది రకాల కస్టమ్స్ డ్యూటీ స్లాబులు ఉన్నాయి. వీటివల్ల ఏ వస్తువుపై ఎంత పన్ను పడుతుందో లెక్కించడం వ్యాపారస్తులకు పెద్ద తలపోటుగా మారింది. దీనిని దృష్టిలో ఉంచుకుని, రాబోయే బడ్జెట్‌లో ఈ స్లాబుల సంఖ్యను ఐదు లేదా ఆరుకు తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల పన్నుల విధానం సరళంగా మారుతుంది. ఏ వస్తువు ఏ వర్గంలోకి వస్తుందనే విషయంలో ఉండే గందరగోళానికి తెరపడుతుంది.

కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు గణాంకాల ప్రకారం..డిసెంబర్ 2024 నాటికి సుమారు 75,592 కస్టమ్స్ కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. వీటి విలువ దాదాపు రూ.24,016 కోట్లు. పన్నుల విధానంలో ఉన్న సంక్లిష్టత వల్లే ఇన్ని వివాదాలు తలెత్తుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఇప్పుడు స్లాబులను తగ్గించడం ద్వారా ఈ వివాదాలను తగ్గించాలని, అలాగే ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేయని వ్యాపారస్తుల కోసం ప్రత్యేక మాఫీ పథకం ప్రవేశపెట్టాలని పారిశ్రామిక వర్గాలు కోరుతున్నాయి.

కస్టమ్స్ డ్యూటీ స్లాబులను హేతుబద్ధీకరించడం వల్ల కొన్ని రకాల విదేశీ ఎలక్ట్రానిక్ వస్తువులు, యంత్ర పరికరాలు, ముడి సరుకుల ధరలు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్(ముడి సరుకుపై ఎక్కువ పన్ను, తయారైన వస్తువుపై తక్కువ పన్ను ఉండటం)లో ఉన్న లోపాలను సరిదిద్దడం వల్ల దేశీయ పరిశ్రమలకు మేలు జరుగుతుంది. ఇది అటు సామాన్యులకు ధరల తగ్గింపు రూపంలో, ఇటు పరిశ్రమలకు తయారీ ఖర్చు తగ్గే రూపంలో లాభం చేకూరుస్తుంది.

ప్రత్యేక ఆర్థిక మండళ్లు, దేశీయ వాణిజ్య ప్రాంతాల మధ్య ఉన్న టారిఫ్ విధానాలను కూడా ఈ బడ్జెట్‌లో పునర్నిర్వచించబోతున్నారు. పేపర్‌లెస్ కస్టమ్స్ విధానాన్ని ప్రోత్సహిస్తూ, వ్యాపార నిర్వహణను సులభతరం చేయడమే మోదీ ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఇటీవల మాట్లాడుతూ.. కస్టమ్స్ ప్రక్రియల సరళీకరణే తమ తదుపరి అజెండా అని స్పష్టం చేశారు. గత మూడు నాలుగు నెలలుగా దీనిపై కసరత్తు జరుగుతోంది కాబట్టి, బడ్జెట్ ప్రసంగంలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడటం ఖాయమని తెలుస్తోంది.

Tags:    

Similar News