Schools Bomb Threat : వరుసగా ఐదోరోజు..పాఠశాలకు బాంబు బెదిరింపు
పోలీసులు, అగ్నిమాపక దళ బృందాల తనిఖీలు;
ఢిల్లీలోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. వరుసగా ఐదోరోజు ఈ-మెయిల్స్ వచ్చాయి. శుక్రవారం ద్వారకా సెక్టార్-7లోని ఒక పాఠశాలకు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీ ఫైర్ సర్వీసెస్‌కు ఉదయం 7 గంటలకు సమాచారం అందగా.. పోలీసులు, అగ్నిమాపక దళ బృందాలు సంఘటనా స్థలంలో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. గురువారం వరకు ఢిల్లీలోని 50కిపైగా పాఠశాలలకు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. దాంతో పోలీసులతో పాటు ఇతర అత్యవసర సేవలన్నీ పాఠశాలల్లో తనిఖీలు చేపట్టగా.. ఇప్పటి వరకు అనుమానాస్పద వస్తువులు మాత్రం కనిపించలేదు.
బాంబు బెదిరింపులు వచ్చిన పాఠశాలల జాబితాలో రాహుల్ మోడల్ స్కూల్, మాక్స్‌ఫోర్ట్ స్కూల్, మాలవీయనగర్‌లోని ఎస్‌కేవీ, ప్రసాద్ నగర్‌లోని ఆంధ్రా స్కూల్స్ ఉన్నాయి. ఆగస్టు 18న, ఢిల్లీలోని 32 పాఠశాలలకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. గతంలో ఢిల్లీలోని ద్వారకలోని సెయింట్ థామస్ స్కూల్, ఢిల్లీ యూనివర్సిటీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్‌లకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. గత ఏడాది మే నెలలో పాఠశాలలకు కూడా మెయిల్స్ వచ్చాయి. గతేడాది మే నెలలోనూ ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. వరుస బెదిరింపుల నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బందిలో భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలకు పంపిన బెదిరింపు సందేశాల గురించి తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.