Turkey: దేశవ్యాప్తంగా ఊపందుకున్న బాయ్‌కాట్‌ తుర్కియే నినాదం

దేశభక్తితోనే నిర్ణయం, సైన్యానికి, ప్రభుత్వానికి మద్దతుగా వ్యాపారుల ప్రకటన;

Update: 2025-05-14 01:15 GMT

భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల సమయంలో దాయాదికి తుర్కియే మద్దతుగా నిలిచిన నేపథ్యంలో ‘బాయ్‌కాట్‌ తుర్కియే’ నినాదం ఊపందుకున్నది. యుద్ధ సమయంలో పాక్‌కు తుర్కియే బహిరంగంగా మద్దతు ప్రకటించడమే కాకుండా డ్రోన్లను సాయం చేసిన విషయం విదితమే. ఆ డ్రోన్లనే పాక్‌ మన దేశంపై ప్రయోగించింది. ఈ నేపథ్యంలో చాలామంది సోషల్‌ మీడియా వేదికగా ‘బాయ్‌కాట్‌, బాన్‌ తుర్కియే’ని ట్రెండ్‌ చేస్తున్నారు. మొన్నటివరకు సోషల్‌మీడియాలో కొనసాగిన ఈ ట్రెండ్‌ ఇప్పుడు క్షేత్రస్థాయిలో అన్ని రంగాలకు వ్యాపిస్తున్నది. ఇప్పటికే తుర్కియే టూరిజంపై దాని ప్రభావం పడింది. ఆ దేశానికి వెళ్లాలనుకునే అనేక మంది భారతీయ పర్యాటకులు విమాన టికెట్లు, హోటళ్ల బుకింగ్‌లను క్యాన్సిల్‌ చేసుకుంటున్నారు. ఇప్పటికే 80 శాతానికి పైగా బుకింగ్‌లు వాయిదా లేదా క్యాన్సిల్‌ అయినట్టు తెలుస్తున్నది. రాజధాని అంకారా టూరిజం తీవ్రంగా ప్రభావితమైంది.

యాపిల్‌ మార్కెట్‌పై ఎఫెక్ట్‌…

ఈ ప్రభావం తుర్కియే యాపిల్‌ మార్కెట్‌పై కూడా పడింది. తుర్కియే యాపిళ్లను దిగుమతి చేసుకోవద్దని పుణె వ్యాపారులు నిర్ణయించారు. తుర్కియే యాపిళ్ల టర్నోవర్‌ ఒక సీజన్‌లో రూ.1000-1200 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఒక్కసారిగా దిగుమతులను తగ్గించుకోవడంతో యాపిళ్లకు భారీగా డిమాండ్‌ ఏర్పడి హోల్‌సేల్‌గా 10 కిలోల యాపిళ్ల ధరలు రూ.200-300 వరకు పెరిగాయి. రిటైల్‌ ధరలు కిలోకు రూ.20-30 వరకు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌, వాషింగ్టన్‌, న్యూజిలాండ్‌లతోపాటు మన దేశంలోని హిమాచల్‌, ఉత్తరాఖండ్‌ల నుంచి యాపిళ్లను దిగుమతి చేసుకునేందుకు వ్యాపారులు మొగ్గుచూపుతున్నారు.

Tags:    

Similar News