వంద అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలన్న సామెతను అతను పాటిద్దాం అనుకున్నాడు. మరీ వంద అక్కర్లేదు కానీ, కనీసం ఓ రెండు అబద్ధాలు ఆడదామని ఫిక్స్ అయ్యాడు. కానీ రెండు రకాలుగాను దొరికిపోయి చివరికి దెబ్బలు కాసాడు. బిహార్ గయాలో ఈ ఆసక్తికర ఘటన జరిగింది.
మొదటి పెళ్ళాంతో ఏం సమస్య ఉందో తెలియదు గానీ ఎవరికీ చెప్పకుండా రెండో పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యాడు ఒక ప్రబుద్ధుడు. అలా అని మహానుభావుడు ఏమన్నా అందగాడా అంటే అదీ కాదు. దీంతో కొత్త పెళ్లాం కోసం అద్భుతమైన విగ్గు కొనుక్కున్నాడు. యంగ్ గా కనబడినట్టు ఉంటుంది, తనని ఎవరూ గుర్తుపట్టే అవకాశం కూడా ఉండదు అని ఫిక్స్ అయ్యాడు. మంచి విగ్గు ధరించి పెళ్లి మండపానికి వచ్చాడు. కట్ చేస్తే
పందిట్లో ఎవరికో అనుమానం వచ్చింది.. విగ్గు విషయం బయట పడింది. వళ్ళు మండిన వధువు బంధువులు అతడిని చావ చితకొట్టారు. అప్పుడు అసలు రూపే కాదు.. గుణము బయటపడింది.
అతడికి ఇది రెండో పెళ్లని, విగ్గు ధరించి వివాహానికి వచ్చాడని తెలిసి మళ్ళీ మళ్ళీ కొట్టారు. తాను చేసింది తప్పే.. వదిలేయాలంటూ నిందితుడు ప్రాధేయపడ్డాడు. సరిగ్గా అదే సమయానికి విషయం తెలుసుకున్న అతడి భార్య ఘటనా స్థలానికి వచ్చింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయంలో జోక్యం చేసుకున్న గ్రామస్థులు.. పంచాయితీ పెట్టి సమస్యను పరిష్కరించారు.