Budget 2026 : రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్.. జనవరి 28 నుంచి పార్లమెంటులో బడ్జెట్ జాతర.
Budget 2026 : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ సమావేశాలు జనవరి 28 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల షెడ్యూల్ ప్రకారం.. తొలిరోజు అంటే జనవరి 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇది కొత్త ఏడాదిలో జరిగే మొదటి పార్లమెంట్ సెషన్ కావడంతో రాష్ట్రపతి ప్రసంగం అత్యంత కీలకం కానుంది. ఇక జనవరి 29న బీటింగ్ రిట్రీట్ వేడుకల కారణంగా సభకు సెలవు ప్రకటించారు.
సాధారణంగా బడ్జెట్ అనేది పనిదినాల్లో ప్రవేశపెట్టడం ఆనవాయితీ. కానీ, ఈసారి ఫిబ్రవరి 1 ఆదివారం వచ్చినప్పటికీ, ప్రభుత్వం అదే రోజున బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. మార్కెట్లకు సెలవు ఉన్న రోజే దేశ ఆర్థిక దిశానిర్దేశం జరగనుండటం విశేషం. దీనికి ముందు జనవరి 30న దేశ ఆర్థిక పరిస్థితిని తెలిపే ఎకనామిక్ సర్వే నివేదికను ఆర్థిక మంత్రి పార్లమెంటు ముందు ఉంచుతారు. జనవరి 31న లోక్‌సభ, రాజ్యసభలకు విరామం ఉంటుంది.
బడ్జెట్ సమావేశాలను రెండు విడతలుగా నిర్వహించనున్నారు. మొదటి విడత జనవరి 28న ప్రారంభమై ఫిబ్రవరి 13తో ముగుస్తుంది. ఆ తర్వాత సుమారు ఒక నెల రోజుల పాటు విరామం ఉంటుంది. రెండో విడత మార్చి 9న ప్రారంభమై ఏప్రిల్ 2 వరకు కొనసాగుతుంది. ఏప్రిల్ 3న గుడ్ ఫ్రైడే సెలవు ఉండటంతో, గురువారం (ఏప్రిల్ 2) రోజే సమావేశాలకు ముగింపు పలకాలని అధికారులు భావిస్తున్నారు. ఈ విరామ సమయంలో పార్లమెంటరీ కమిటీలు వివిధ శాఖల బడ్జెట్ కేటాయింపులపై లోతైన చర్చలు జరుపుతాయి.
ఈసారి బడ్జెట్ రూపకల్పనలో మరో ఆసక్తికరమైన అంశం ఉంది. సాధారణంగా ఆర్థిక శాఖలో అత్యంత సీనియర్ అధికారి ఫైనాన్స్ సెక్రటరీగా ఉండి బడ్జెట్ పనులను పర్యవేక్షిస్తారు. కానీ ప్రస్తుతం ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఫైనాన్స్ సెక్రటరీ పోస్టు ఖాళీగా ఉంది. అయినప్పటికీ నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని అధికారుల బృందం ఎక్కడా తగ్గకుండా బడ్జెట్ కసరత్తును పూర్తి చేస్తోంది. ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పులు, సామాన్యులకు ఊరటనిచ్చే ప్రకటనలు ఉంటాయేమోనని దేశమంతా ఆశగా ఎదురుచూస్తోంది.