Budget 2026 : నిర్మలమ్మకు పారిశ్రామిక వేత్తల విన్నపాలు..ఫిబ్రవరి 1న అదృష్టం ఎవరిని వరిస్తుందో?

Update: 2026-01-21 06:30 GMT

Budget 2026 : ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న యూనియన్ బడ్జెట్ 2026-27 కేవలం ప్రభుత్వ లెక్కలే కాదు, దేశ ఆర్థిక భవిష్యత్తును నిర్ణయించే కీలక పత్రం. ప్రస్తుతం ప్రపంచ దేశాల మధ్య వాణిజ్య యుద్ధాలు నడుస్తున్న తరుణంలో, భారత పరిశ్రమలు తమ ఉనికిని కాపాడుకోవడానికి, విస్తరించడానికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలను ఆశిస్తున్నాయి. ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా పథకానికి మరింత ఊపునిచ్చేలా, దేశీయ తయారీ రంగానికి మూలధన సబ్సిడీలు, సులభతర వాణిజ్య నిబంధనలను పరిశ్రమల రంగం కోరుతోంది.

AI - భవిష్యత్తుకు భరోసా: ఈసారి బడ్జెట్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‎కి పెద్దపీట వేసే అవకాశం ఉంది. భారతదేశాన్ని కేవలం AI వినియోగదారు దేశంగానే కాకుండా, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ తయారీలో గ్లోబల్ లీడర్‌గా మార్చాలని పరిశ్రమల పెద్దలు కోరుతున్నారు. ఇందుకోసం డేటా సెంటర్లు, ఏఐ స్టార్టప్‌లకు ట్యాక్స్ మినహాయింపులు, స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌ల కోసం భారీ కేటాయింపులు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ముఖ్యంగా వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో ఏఐ వాడకాన్ని పెంచేలా ప్రోత్సాహకాలు ఉండవచ్చని సమాచారం.

ఇన్సూరెన్స్, పారిశ్రామిక రంగాలు: భారతదేశంలో ఇన్సూరెన్స్ వ్యాప్తి పెరగాలంటే, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై జీఎస్‌టీని తగ్గించాలని సుదీర్ఘకాలంగా డిమాండ్ ఉంది. 18 శాతం నుంచి దీనిని 5 శాతానికి లేదా సున్నా శాతానికి తగ్గించాలని నిపుణులు కోరుతున్నారు. ఇక తయారీ రంగం విషయానికి వస్తే, లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించేలా ఎయిర్ కార్గో, రైల్వే డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. కాపెక్స్ వ్యయాన్ని రూ.11 లక్షల కోట్ల నుంచి రూ.15 లక్షల కోట్లకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సామాన్యుడి ఆశలు - ఆదాయపు పన్ను: పరిశ్రమల రంగమే కాకుండా, సగటు జీవి కూడా ఈ బడ్జెట్ ద్వారా ఆదాయపు పన్నులో మార్పులను ఆశిస్తున్నాడు. పాత పన్ను విధానాన్ని పూర్తిగా సమీక్షించి, మధ్యతరగతి ప్రజలకు జేబులో ఎక్కువ డబ్బు మిగిలేలా రాయితీలు ఇవ్వాలని జనం కోరుకుంటున్నారు. ఫిస్కల్ డెఫిసిట్ (ద్రవ్య లోటు)ను 4.4% లోపు ఉంచుతూనే, అభివృద్ధి పథకాలను ఎలా ముందుకు తీసుకెళ్తారనేది నిర్మలమ్మ చాకచక్యానికి పరీక్ష.

Tags:    

Similar News