Budget 2026 : బడ్జెట్ అంటే ఫిబ్రవరి 1వ తేదీనే ఎందుకు? ఆ తేదీ వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే.
Budget 2026 : దేశవ్యాప్తంగా బడ్జెట్ 2026 సందడి మొదలైంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో కసరత్తులు తుది దశకు చేరుకున్నాయి. ప్రతి ఏటా ఫిబ్రవరి 1వ తేదీనే బడ్జెట్ ప్రవేశపెట్టడం మనకు అలవాటుగా మారింది. అయితే అసలు ఈ బడ్జెట్‌ను ఫిబ్రవరి 1నే ఎందుకు ప్రవేశపెడతారు? దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? అలాగే ఈసారి సామాన్యుడికి, ముఖ్యంగా ట్యాక్స్ పేయర్లకు ఎలాంటి ఊరట లభించనుంది? అనే ఆసక్తికర విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
భారతదేశంలో ఒకప్పుడు బడ్జెట్‌ను ఫిబ్రవరి నెల చివరి రోజున ప్రవేశపెట్టేవారు. ఇది బ్రిటిష్ కాలం నుంచి వస్తున్న ఆచారం. అయితే 2017లో మోదీ ప్రభుత్వం ఈ పాత సంప్రదాయాన్ని మార్చేసింది. అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ తేదీని ఫిబ్రవరి 1కి మార్చారు. దీని వెనుక బలమైన కారణం ఉంది. మన దేశంలో కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న మొదలవుతుంది. ఫిబ్రవరి చివరలో బడ్జెట్ ప్రవేశపెడితే, దానిపై చర్చలు ముగిసి నిధులు విడుదలయ్యేసరికి మే లేదా జూన్ నెల వచ్చేది. దీనివల్ల కొత్త పథకాలు ప్రారంభం కావడానికి ఆలస్యమయ్యేది. అందుకే, ఫిబ్రవరి 1నే బడ్జెట్ ప్రవేశపెడితే.. ఏప్రిల్ 1 నాటికి అన్ని పక్రియలు పూర్తయి, కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజు నుండే నిధులు అందుబాటులోకి వస్తాయి.
బడ్జెట్ తేదీ సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు సామాన్యులందరి దృష్టి సెక్షన్ 80C పైనే ఉంది. గత దశాబ్ద కాలంగా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద ఇచ్చే రూ.1.5 లక్షల మినహాయింపులో ఎలాంటి మార్పు లేదు. కానీ ఈ పదేళ్లలో ద్రవ్యోల్బణం, ఖర్చులు రెట్టింపు అయ్యాయి. పీఎఫ్, ఎల్ఐసీ, పీపీఎఫ్ వంటి పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేసే మధ్యతరగతి ప్రజలకు ఈ పరిమితి ఏమాత్రం సరిపోవడం లేదు. పాత పన్ను విధానాన్ని ఎంచుకునే వారు ఈ పరిమితిని కనీసం రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచాలని కోరుతున్నారు. ఇలా చేస్తే ప్రజల్లో పొదుపు చేసే అలవాటు పెరగడమే కాకుండా, చేతిలో కొంత డబ్బు మిగిలి ఊరట లభిస్తుంది.
కేవలం ఉద్యోగులే కాకుండా.. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు కూడా ఈ బడ్జెట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మ్యూచువల్ ఫండ్ సంస్థల అసోసియేషన్ ఇప్పటికే ఆర్థిక మంత్రిత్వ శాఖకు కీలక ప్రతిపాదనలు పంపింది. రిటైల్ ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు మొగ్గు చూపేలా పన్ను రాయితీలు ఇవ్వాలని కోరింది. ముఖ్యంగా డెట్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్లపై పన్ను నిబంధనలను సరళతరం చేయాలని, మధ్యతరగతి కుటుంబాలకు వెల్త్ క్రియేషన్(సంపద సృష్టి)లో ప్రభుత్వం తోడ్పడాలని విజ్ఞప్తి చేసింది. ఒకవేళ ఏమ్ఫీ సూచనలను ప్రభుత్వం ఆమోదిస్తే, సామాన్య ఇన్వెస్టర్లకు స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది.
మొత్తానికి బడ్జెట్ 2026 పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గత బడ్జెట్లలో ప్రభుత్వం కొత్త పన్ను విధానానికే ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. అయితే, పాత విధానంలో ఉన్న మినహాయింపులను కూడా అప్‌డేట్ చేయాలని సామాన్యులు గట్టిగా కోరుతున్నారు. నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఎవరిని ఖుషీ చేస్తారో తెలియాలంటే ఫిబ్రవరి 1వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.