మియాన్-తియాన్, పాకిస్థానీ అని పిలవడాన్ని నేరంగా పరిగణించలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఝార్ఖండ్‌కు చెందిన ఓ ఉర్దూ తర్జుమా ఉద్యోగి వద్ద ఓ వ్యక్తి ఆర్టీఐ దరఖాస్తు చేసుకున్నాడు. ఈ సందర్భంగా వారి మధ్య గొడవ జరిగి ఉద్యోగిని పాకిస్థానీ అంటూ దరఖాస్తుదారుడు దూషించాడు. అతడిపై చర్యలకు ఝార్ఖండ్ కోర్టు ఆదేశించగా అతడు సుప్రీంను ఆశ్రయించాడు. ఆ కేసు విచారణలో ధర్మాసనం తాజా తీర్పు చెప్పింది. ఫిర్యాదుదారుడి ప్రకారం.. సమాచార హక్కు చట్టం (RTI) కింద సమాచారం కోరుతూ దరఖాస్తు ఇచ్చిన సమయంలో... నిందితుడు అతడి మతాన్ని ప్రస్తావిస్తూ దుర్భాషలాడాడు.. అధికారిక విధులను నిర్వర్తించకుండా నిరోధించేలా నేరపూరిత చర్యలకు పాల్పడ్డాడు. మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించాడని పేర్కొంటూ నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతడిపై ఐపీసీ సెక్షన్ 298, 504, 353 తదితర సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది. ఈ క్రమంలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. కానీ, ఉన్నత న్యాయస్థానం అతడి అభ్యర్థనను తిరస్కరించింది.