PFI Ban : 'పీఎఫ్‌ఐ' సంస్థను బ్యాన్ చేసిన కేంద్రం..

PFI Ban : 2047 లక్ష్యంగా పీఎఫ్ఐ పనిచేస్తున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది.;

Update: 2022-09-28 12:45 GMT

PFI Ban : భారత్‌ను ఇస్లామిక్‌ రాజ్యంగా మార్చడమే లక్ష్యంగా భారీ కుట్రకు ప్లాన్‌ చేస్తున్న ఇస్లామిక్‌ అతివాద సంస్థ పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా, దాని అనుబంధ సంస్థలపై కేంద్రం కఠిన చర్యలకు ఉపక్రమించింది.. ఐదేళ్ల పాటు నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. దేశంలో భారీ కుట్రకు పథకం వేశారన్న సమాచారం రావడంతో ఇటీవల పీఎఫ్‌ఐ సభ్యుల ఇళ్లు, కార్యాలయాలపై జాతీయ దర్యాప్తు సంస్థ, ఇతర దర్యాప్తు ఏజెన్సీలతో కలిసి ఇటీవల భారీ ఆపరేషన్‌ చేపట్టింది.

వారం వ్యవధిలో రెండు సార్లు జరిపిన ఈ సోదాల్లో 250 మందికి పైగా పీఎఫ్‌ఐ సభ్యులు, కార్యకర్తలను ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేశారు.. ఈ సోదాల్లో అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారీగా క్రిమినల్‌ డాక్యుమెంట్స్‌ను ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకుంది. దీనిపై ఎన్‌ఐఏ తన రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలను బయటపెట్టింది.

పీఎఫ్‌ఐ, దాని అనుబంధ సంస్థలు దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో విస్తరించి ఉండగా.. హింస, నేరాలు, ఉగ్రవాదం, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన అనేక కేసుల్లో పీఎఫ్‌ఐ సభ్యులు నిందితులుగా ఉన్నారని ఎన్ఐఏ రిమాండ్‌ రిపోర్టులో పేర్కొంది.. రెండు వర్గాల మధ్య మతవిద్వేషాలను రెచ్చగొట్టడమే లక్ష్యంగా ఈ సంస్థ తమ సభ్యులకు శిక్షణ ఇస్తోందని తెలిపింది.. పలు రాష్ట్రాల్లో పీఎఫ్‌ఐ సభ్యులు, దాని అనుబంధ సంస్థలపై 1300కు పైగా క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి.

పోలీసులతోపాటు ఎన్‌ఐఏ అధికారులు ఈ కేసులు నమోదు చేశారు. లష్కరే, ఐసిస్‌ వంటి ఉగ్రవాద సంస్థల్లో చేరేలా పీఎఫ్‌ఐ యువతను ప్రేరేపిస్తోందని ఎన్‌ఐఏ తన రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొంది. దీంతోపాటు బీజేపీ, RSS నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసేందుకు ఈ సంస్థ కుట్రలు పన్నుతున్నట్లు తెలిపింది.

పీఎఫ్‌ఐకి జమాత్‌ ఉల్ ముజాహిదీన్‌తో సంబంధాలున్నట్లు ఆరోపణలున్నాయి. అంతేకాదు, కేరళలో కొంతమంది పీఎఫ్‌ఐ కార్యకర్తలు ఆ మధ్య ISISలో చేరి సిరియా, ఇరాక్‌, అఫ్గానిస్థాన్‌ వంటి దేశాల్లో ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు ఆధారాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఐసిస్‌తో కలిసి పనిచేస్తోన్న కొంతమంది కార్యకర్తలను ఎన్‌ఐఏ, కేరళ పోలీసులు గతంలో అరెస్టు చేశారు. గత ఏడాది కేరళలో ఓ ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త హత్యకు గురి కాగా, 2019లో తమిళనాడులో హిందూ నేత అతి దారుణంగా హత్యకు గురయ్యాడు.

ఈ కేసుల్లో పీఎఫ్‌ఐ కార్యకర్తలే ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఈ ఏడాది కర్నాటకలో జరిగిన హిందూ కార్యకర్త ప్రవీణ్‌ హత్యకేసులో అరెస్టయిన వారంతా పీఎఫ్‌ఐ కార్యకర్తలే.. ఇక గత ఏడాది జూన్‌లో కేరళలోని కొల్లాం జిల్లాలో ఓ అటవీ ప్రాంతంలో పేలుడు పదార్థాలు, జిహాదీ సాహిత్యాన్ని పోలీసులు గుర్తించగా.. ఆ అటవీ ప్రాంతాన్ని పీఎఫ్‌ఐ మిలిటరీ శిక్షణ కేంద్రంగా ఉపయోగిస్తున్నట్లు బయటపడింది.

ఇటీవల ఎన్‌ఐఏ జరిపిన సోదాల్లో ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించి అనేక ఆధారాలు లభ్యమయ్యాయి.. భారత్‌ను ఇస్లామిక్‌ రాజ్యంగా మార్చడమే లక్ష్యంగా పీఎఫ్‌ఐ కుట్ర చేస్తున్నట్లు కీలక సమాచారం బయటపడింది.. ఇక ఉగ్రవాద సంస్థలతో లింకులున్న పీఎఫ్‌ఐకి దేశ విదేశాల నుంచి నిధులు వస్తుండటం, 100కు పైగా బ్యాంకు ఖాతాలు, ఖాతాదారుల ఆర్థిక వివరాలతో సరిపోవడం లేదని ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు గుర్తించాయి..

ఈ కారణంగా ఐటీ చట్టంలోని కొన్ని సెక్షన్ల కింద పీఎఫ్‌ఐ రిజిస్ట్రేషన్‌ హోదాను కూడా కేంద్రం ఉపసంహరించింది. దీంతోపాటు పీఎఫ్‌ఐ, దాని అనుబంధ సంస్థలపై ఐదేళ్లపాటు నిషేధం విధించింది.. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని కేంద్రం స్పష్టం చేసింది.

అటు పీఎఫ్‌ఐపై కేంద్ర ప్రభుత్వ నిషేధాన్ని బీజేపీ నేతలు స్వాగతిస్తుంటే.. విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.. పీఎఫ్‌ఐపై నిషేధం విధించిన తరహాలోనే విద్వేషాలను రెచ్చగొడుతున్న అన్ని సంస్థలపై బ్యాన్‌ విధించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ను ఉద్దేశిస్తూ ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ వ్యాఖ్యలు చేశారు.. అటు కేంద్రం నిర్ణయాన్ని ఎంఐఎం చీఫ్‌ అసుద్దీన్‌ ఒవైసీ కూడా తప్పుపట్టారు.. అయితే, తన స్టాండ్‌ పీఎఫ్‌ఐకి కూడా అనుకూలం కాదని స్పష్టం చేశారు. ఈ రకమైన నిషేధం ప్రమాదకరమన్నారు.. తన అభిప్రాయాన్ని చెప్పాలనుకునే ముస్లింలపై నిషేధమని అన్నారు.

Tags:    

Similar News