CAA Law: దేశవ్యాప్తంగా అమల్లోకి CAA..

. ఏం జరగనుందంటే.?

Update: 2024-03-11 23:15 GMT

పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్తాన్‌ నుంచి భారత్‌కు వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు మన దేశ పౌరసత్వం లభించనుంది. ఆయా దేశాల్లో వివక్ష ఎదుర్కొని.. భారత్‌కు వచ్చిన వారికి మన పౌరసత్వం కల్పించే పౌరసత్వ సవరణ చట్టం సీఏఏ 2019 చట్టాన్ని కేంద్రం అమల్లోకి తెచ్చింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై విపక్షాలు భగ్గుమన్నాయి. భాజపాది విభజన ఎజెండా అని మండిపడుతున్నాయి. అటు.. సీఏఏను తమ రాష్ట్రాల్లో అమలు చేయబోయేది లేదని పశ్చిమబెంగాల్‌, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పష్టం చేశారు.

పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గనిస్థాన్‌ నుంచి భారత్‌కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు మనదేశ పౌరసత్వం కల్పించడం లక్ష్యంగా నోటిఫికేషన్ జారీచేసింది. CAA చట్టం 2013లో పార్లమెంటు ఆమోదం పొంది రాష్ట్రపతి సమ్మతి లభించింది. ఐతే విపక్షాల ఆందోళనలు, దేశవ్యాప్త నిరసనలు, పూర్తిస్థాయి నిబంధనలపై సందిగ్ధం నెలకొనడంతో చట్టం అమలు కాలేదు. ఈ చట్టం ప్రకారం పాక్‌, బంగ్లాదేశ్, అఫ్గాన్‌ నుంచి వలస వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైన, బౌద్ధ, పార్సీల వద్ద తగిన పత్రాలు లేకున్నా వారికి సత్వరం మన పౌరసత్వాన్ని కేంద్రం ఇవ్వనుంది. అయితే వారు 2014 డిసెంబరు 31 కంటే ముందు వచ్చి ఉండాలి. దరఖాస్తు, పౌరసత్వ జారీ తదితర ప్రక్రియ అంతా ఆన్లైన్‌లోనే ముగిసేలా కేంద్రం నిబంధనలు రూపొందించింది. దరఖాస్తుదారుల నుంచి పత్రాలేమి అడగరు. మతపర వేధింపులను తట్టుకోలేక వలస వచ్చిన వారికి మానవతా దృక్పథంతో ప్రాథమిక హక్కులు, పౌరసత్వం కల్పించేలా రాజ్యాంగం అవకాశం కల్పిస్తోందని ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ తెలిపింది.

ఈ చట్టం పౌరసత్వం దక్కిన వారికి న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోతాయి. దశాబ్దాల నుంచి కాందిశీకుల్లా బతుకుతున్నవారికి గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది. వారి భాష, సంస్కృతి, సామాజిక గుర్తింపులకు రక్షణ లభిస్తుంది. ఎక్కడికైనా రాకపోకలు, ఆస్తుల కొనుగోలుకు ఆస్కారం ఉంటుంది. వారిపై అక్రమ వలస కేసులన్నీ మూసేస్తారు. చట్టం పరిధిలో ముస్లిమేతరులనే ప్రస్తావించడంపై గతంలో దేశంలో నిరసనలు వెల్లువెత్తి 53 మంది ప్రాణాలు కోల్పోయారు.

సీఏఏ అమలు నేపథ్యంలో.. సున్నిత ప్రాంతాలైన పలు చోట్ల భద్రత కట్టుదిట్టం చేశారు. ఈశాన్య దిల్లీ, షాహీన్బాగ్, జామియానగర్ ప్రాంతాల్లో భద్రత పెంచారు. వదంతుల్ని, విద్వేషాన్ని రెచ్చ గొట్టే వ్యాఖ్యల్ని గుర్తించడానికి సామాజిక మాధ్యమ ఖాతాలపైనా సైబర్ విభాగం దృష్టి సారించింది. కేంద్ర ప్రకటన వెలువడగానే అస్సాంలో 'ఆసు' సహా వివిధ సంఘాలు ఆందోళనకు దిగాయి. CAA ప్రతుల్ని కాల్చివేసి ఇవాళ హరాళ్ పాటించాలని పిలుపునిచ్చాయి. కేంద్రం మాత్రం.. ఈ సీఏఏ వల్ల ఎవరికీ నష్టం ఉండదని, కొత్తవారికి పౌరసత్వం ఇస్తామని, ఇక్కడి భారతీయుల పౌరసత్వాలు రద్దు కాబోవని హామీ ఇచ్చింది.

మరోవైపు.. సీఏఏ అమలుపై పశ్చిమబెంగాల్‌, దిల్లీల్లోని లబ్ధి పొందనున్న శరణార్థులు హర్షం వ్యక్తంచేశారు. తాము భారతీయ పౌరులం ఐనందుకు సంతోషంగా ఉందంటూ.. దీపాలు వెలిగించి, 3 రంగుల జెండాలు పట్టుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  

Tags:    

Similar News