Central Government : కేంద్రం మీద ఉన్న మొత్తం అప్పు ఎన్ని లక్షల కోట్లో తెలుసా?
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం అప్పు రూ.185 లక్షల కోట్లకు చేరనుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి వెల్లడించారు. విదేశీ రుణాలతో కలిపి ప్రస్తుత ధరల వద్ద ఈ మొత్తానికి చేరవచ్చని కేంద్రం అంచనా వేసింది. ఇది దేశ జీడీపీలో 56.8 శాతానికి సమానమన్నారు.
2024 మార్చి చివరి నాటికి కేంద్రం అప్పు రూ.171.78 లక్షల కోట్లుగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం, 2014ను అనుసరించి వెనుకబడిన ఏడు జిల్లాలకు రూ.2100 కోట్లు సాయం అందించాలని నీతి ఆయోగ్ సూచించిందని పంకజ్ చౌధరి మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఒక్కో జిల్లాకు రూ.300 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించిందని పేర్కొన్నారు.
నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు ఏపీలోని వెనుకబడిన జిల్లాలకు ఇప్పటి వరకు రూ.1750 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.