Chandrayaan-3: చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో...

ఆరునూరైనా విజయం సాధిస్తామంటున్న ఇస్రో శాస్త్రవేత్తలు... రేపే చంద్రయాన్‌-3 దక్షిణ ధ్రువంపై కాలుమోపనున్న విక్రమ్‌ ల్యాండర్‌;

Update: 2023-08-22 03:15 GMT

అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర లిఖించేందుకు భారత్‌ ఒక్క అడుగు దూరంలో నిలిచింది. ఇప్పటివరకు ఏ దేశమూ చేరుకోని జాబిల్లి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌( Chandrayaan-3 landing) కోసం బుధవారం సాయంత్రం ఇస్రో ప్రయత్నించనుంది. ఆ చరిత్రాత్మక క్షణాల కోసం ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఇటీవల రష్యా ప్రయోగించిన అంతరిక్ష నౌక లూనా-25(Russia’s Luna-25 Crash)చంద్రునిపై కుప్పకూలినా ఆ ప్రభావం ఇస్రోపై పడదని(Anticipation Builds in India) అంతరిక్ష శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకుని ఇస్రో తీసుకున్న అనేక జాగ్రత్తల వల్ల ఈసారి మిషన్‌ విజయవంతమవుతుందని విశ్వాసంతో ఉన్నారు.


ఇప్పటివరకు ఏ దేశమూ చేరుకోని జాబిల్లి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్‌-3 అడుగుపెట్టనున్న వేళ సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జాబిల్లిపై బుధవారం సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు ల్యాండర్‌ విక్రమ్‌(Vikram module ) దిగనుండగా ఆ క్షణాల కోసం యావత్‌ భారతావని ఆసక్తిగా ఎదురు చూస్తోంది. రష్యాకు చెందిన లూనా-25 జాబిల్లిపై కుప్పకూలింది. అయితే రష్యా ప్రయోగం విఫలమవడంతో ఇస్రోపై అదనపు ఒత్తిడి ఏమీ ఉండదని 2019లో చంద్రయాన్‌-2 మిషన్‌కు నేతృత్వం వహించిన ఇస్రో మాజీ ఛైర్మన్‌ K శివన్‌ అభిప్రాయపడ్డారు. చంద్రయాన్‌-3 మిషన్‌ పక్కా ప్రణాళిక ప్రకారం సాగుతోందన్నారు. ఈసారి చంద్రయాన్‌-3 తప్పక విజయవంతం అవుతుందని శివన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

చంద్రయాన్‌-2తో చేసిన ప్రయత్నం చివరి క్షణాల్లో విఫలమవడంతో.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఈసారి పకడ్బందీగా సిద్ధమైందని శాస్త్రవేత్తలు గుర్తు చేశారు. నాటి వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకొని.. వైఫల్య ఆధారిత డిజైన్‌తో చంద్రయాన్‌-3ని ప్రయోగించింది. అందుకే ఆరునూరైనా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా బుధవారం సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు వ్యోమనౌక చందమామ దక్షిణ ధ్రువం వద్ద దిగడం ఖాయమని ఇస్రో ధీమా వ్యక్తం చేస్తోంది. చంద్రయాన్‌-3 ల్యాండర్‌ను వైఫల్యాలకు ఉన్న ఆస్కారాలను విశ్లేషించుకొని, వాటిని అధిగమించేలా ఫెయిల్యూర్‌ బేస్డ్‌ డిజైన్‌తో ఇస్రో రూపొందించింది. అనుకోని అవాంతరం తలెత్తినా ల్యాండర్‌.. విజయవంతంగా చంద్రుడిపై దిగేలా కసరత్తు చేపట్టింది.


నాలుగింట్లో రెండు ఇంజిన్లు విఫలమైనా సాఫ్ట్‌ ల్యాండయ్యేలా ల్యాండర్‌ను తీర్చిదిద్దారు. నిర్దేశిత ల్యాండింగ్‌ ప్రదేశంలో దిగలేకపోతే చంద్రయాన్‌-3 ల్యాండర్‌.. ప్రత్యామ్నాయాలను వెతుకుతుంది. అవసరమైతే 150 మీటర్ల వరకూ పక్కకు వెళ్లగలదు. ఇందుకు అనుగుణంగా ఇంధనం పరిమాణాన్ని పెంచారు. అనూహ్య పరిస్థితుల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ సౌకర్యాన్నీ కల్పించారు. ఇవేవీ చంద్రయాన్‌-2లో లేవు. బ్యాటరీల సామర్థ్యం చంద్రయాన్‌-2లో 52.5 ఏహెచ్‌గా ఉండగా ఇప్పుడు 63 ఏహెచ్‌కు పెంచారు. ల్యాండర్‌ ఏ దిశలో దిగినా సమర్థంగా సౌరశక్తిని ఒడిసిపట్టేలా సోలార్‌ ప్యానళ్లను పెంచారు.

ఒకవేళ చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్‌ను రేపు ల్యాండ్ చేయడం కుదరకపోతే ఆగస్టు 27న ఆ ప్రయోగం చేపడతారని అహ్మదాబాద్‌కు చెందిన స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ ఎం దేశాయ్ తెలిపారు. ఆగస్టు 23న ల్యాండింగ్‌కు రెండు గంటల ముందు, ల్యాండర్ మాడ్యూల్ ఎలా ఉంది... చంద్రుడిపై పరిస్థితులు ఎలా ఉన్నాయ్‌ అన్న పరిస్థితుల ఆధారంగా ల్యాండింగ్ చేయడం సముచితమా కాదా అనేది నిర్ణయిస్తామని ఆయన తెలిపారు. 

Tags:    

Similar News