PM Kisan : పీఎం కిసాన్ 21వ విడత ఎందుకు ఆలస్యం అవుతుంది.. రైతులకు డబ్బులు ఎప్పుడు వస్తాయి ?
PM Kisan : ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రైతులకు రూ. 2,000 చొప్పున 20 విడతల డబ్బును విడుదల చేసింది. ఈ పథకం కింద ఏడాదికి మూడు సార్లు రైతులకు ఆర్థిక సహాయం అందుతుంది. అయితే ఇప్పుడు రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 21వ విడత నిధుల విడుదలలో ఆలస్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా రావాల్సిన సమయానికి కాకుండా ఈసారి నవంబర్ నెలాఖరు వరకు వేచి చూడాల్సి రావచ్చని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతులు ప్రతి సంవత్సరం రూ. 6,000 ఆర్థిక సహాయం పొందుతారు. అయితే ఈసారి 21వ విడత నిధుల విడుదలలో ఆలస్యం జరుగుతోంది. కొన్ని నివేదికలు అక్టోబర్ 31 లోపు విడుదల కావచ్చని చెప్పగా మరికొన్ని నవంబర్ మొదటి వారం లేదా నవంబర్ నెలాఖరు వరకు కూడా ఆలస్యం కావచ్చని సూచిస్తున్నాయి. ఈ జాప్యానికి ప్రధాన కారణం ఈ పథకానికి అర్హత లేని లబ్ధిదారులను గుర్తించి వారిని తొలగించే ప్రక్రియ వేగవంతం కావడమే.
పీఎం కిసాన్ పథకం వ్యవసాయాన్ని నమ్ముకుని జీవిస్తున్న రైతుల కోసం రూపొందించారు. కానీ, చాలా మంది అర్హత లేనివారు కూడా ఈ పథకంలో నమోదు చేసుకుని డబ్బులు పొందుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అనర్హులను గుర్తించి వారి పేర్లను తొలగించిన తర్వాత తుది జాబితా ఇవ్వాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ప్రస్తుతం ప్రతి లబ్ధిదారుని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించే పని జరుగుతోంది. ఈ పరిశీలన ప్రక్రియ పూర్తి కావడానికి సమయం పడుతుండటంతోనే, ఈసారి నిధుల విడుదలలో ఆలస్యం అవుతున్నట్లు అధికారిక వర్గాల నుంచి సమాచారం.
పీఎం కిసాన్ యోజన కింద ఆర్థిక సహాయం పొందడానికి సొంత వ్యవసాయ భూమి ఉన్న రైతులు అర్హులు. అయితే, కొన్ని వర్గాల ప్రజలు ఈ పథకానికి అనర్హులుగా పరిగణించబడతారు. సొంత వ్యవసాయ భూమి ఉన్నప్పటికీ, డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తి నిపుణులు, అలాగే రిటైర్ అయిన లేదా ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఈ పథకానికి అర్హులు కారు. సిట్టింగ్ లేదా మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు కూడా అనర్హుల జాబితాలోకి వస్తారు.
పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన మరింత సమాచారం, అర్హత ప్రమాణాలు, అధికారిక అప్‌డేట్‌ల కోసం రైతులు pmkisan.gov.in/ అనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. ఈ పరిశీలన ప్రక్రియ పూర్తయిన తర్వాత, అర్హత కలిగిన రైతులందరికీ తప్పకుండా 21వ విడత డబ్బులు అందుతాయి.