Chaudhary Charan Singh: అన్నదాత ఆత్మబంధువు

చరణ్ సింగ్.. జయంతే రైతు ..;

Update: 2024-02-10 00:30 GMT

స్వాతంత్య్ర సమరయోధుల, రైతు నాయకుడిగా  గుర్తింపు పొందిన చౌదరి చరణ్‌ సింగ్‌ దేశానికి ఐదవ ప్రధాన మంత్రిగా పనిచేశారు. రైతే దేశానికి వెన్నెముక లాంటివాడని నమ్మి అన్నదాతల పక్షాన ఎన్నో పోరాటాలకు  చరణ్‌సింగ్ నేతృత్వం వహించారు. చరణ్‌ సింగ్‌ చేసిన అనేక ఉద్యమాల వల్ల  జమీందారీ చట్టం రద్దు అయ్యింది. కౌలుదారీ చట్టం అమల్లోకి వచ్చింది. రైతులకు బ్యాంకు రుణాలు అందించే విధానం ప్రవేశపెట్టారు. చరణ్‌సింగ్‌ కేంద్ర ఆర్ధిక మంత్రిగా ఉన్న సమయంలోనే పొగాకు రైతులను వేధిస్తున్న ఎక్సైజ్ సుంకాన్ని రద్దు చేశారు.

చౌదరి చరణ్ సింగ్ భారతదేశ తొలి రైతు ప్రధాని. ప్రధాన మంత్రిగా పదవి చేపట్టిన తొలి రైతు చౌదరి చరణ్ సింగ్. 1979లో జులై 28 నుంచి1980 జనవరి 14వ తేదీ వరకు దేశ ప్రధానిగా సేవలందించారు. ఈ కాలంలో భారత రైతుల సంక్షేమం కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. 1902లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో ఆయన జన్మించారు.1937లో తన 34వ ఏట ఉత్తరప్రదేశ్‌ శాసనసభకు జరిగిన ఎన్నికల్లోఛత్రౌలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అదే నియోజకవర్గం నుంచి 1946, 1952, 1962, 1967లలో గెలుపొందారు. 1967, 1970లో రెండుసార్లు ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎంగా పనిచేశారు. భారతదేశ తొలి రైతు ప్రధానిగా చరణ్ సింగ్ పేరు గడించారు. వ్యవసాయ రంగం, రైతుల గురించి ఎంతగానో ఆలోచించి, వారి సమస్యల పరిష్కారానికి కృషిచేసిన చరణ్‌ సింగ్‌ సేవలకు గుర్తుగా..ప్రతి ఏడాది డిసెంబర్ 23న చరణ్‌ సింగ్‌ జన్మదినోత్సవాన్ని జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటారు.


ఉత్తర్‌ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రంలో హోమ్, ఆర్ధిక శాఖ మంత్రిగా కూడా చరణ్ సింగ్ పనిచేశారు. ఏ పదవి చేపట్టినా గ్రామాలకు, రైతుల కోసం ఆరాట పడేవారు. భారత రాజకీయాలలో రైతుల సమస్యలే అజెండాగా మొదట ఉత్తర ప్రదేశ్ స్థాయిలో, ఆ తర్వాత జాతీయ స్థాయిలో అనేక పోరాటాలకు చరణ్‌సింగ్‌ నేతృత్వం వహించారు. బలమైన వ్యవసాయరంగం లేకుండా పారిశ్రామిక రంగం అభివృద్ధికి నోచుకోలేదని బలంగా వాదించారు. ప్రభుత్వ ఉద్యోగాలలో రైతుల పిల్లలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని 1939లోనే కాంగ్రెస్ పార్లమెంటరీ ప్యానల్ ముందు ప్రతిపాదన ఉంచారు. ఉత్తర ప్రదేశ్ వ్యవసాయ మంత్రిగా 1952లో తాను తీసుకొచ్చిన జమీందారీ, భూసంస్కరణల బిల్లు తన జీవితంలో సాధించిన గొప్ప విజయంగా చౌదరీ చరణ్‌సింగ్‌ చెప్పేవారు.

కౌలుదారులకు భూములపై యాజమాన్య హక్కులు కలిగించిన ఈ చట్టం గ్రామీణ భారతంలో ఓ విప్లవానికి దారితీసింది. రైతుల కష్టం తెలుసుకున్న ఆయన అసెంబ్లీలో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌ బిల్లును ప్రవేశపెట్టారు. వ్యాపారులు, రైతుల ప్రయోజనాలను కాపాడడానికి ఈ బిల్లు ఉద్దేశం. తర్వాత చాలా రాష్ట్రాలు ఈ బిల్లును ఆమోదించాయి

Tags:    

Similar News