HMPV Virus in India : పిల్లలు జాగ్రత్త.. హాస్పిటళ్లకు తరలుతున్న HMPV టెస్టింగ్ కిట్స్
చాపకింద నీరులా విస్తరిస్తున్న HMPV వైరస్ ఇప్పటికే అధికారికంగా ఏడుగురికి సోకింది. వారిలో ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేకున్నప్పటికీ వైరస్ భారిన పడటం అందరినీ కలవరపరుస్తోంది. ఈ వైరస్ మనుషుల్లో త్వరగా వ్యాప్తి చెందుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. చైనా నుంచి మలేషియా చేరిన ఈ వైరస్ అక్కడ కూడా ఎక్కువమందికి వ్యాప్తి చెందింది. చైనా, మలేషియా దేశాల్లోని ఆసుపత్రులలో హెచ్ఎంపీవీ వైరస్ సోకిన ప్రజలు ఎక్కువగా చేరుతున్నట్టు గుర్తించారు. కొన్నాళ్లుగా చైనాలో HMPV కేసులు పెరుగుతున్నాయి. చాలా మంది రోగులకు ఆక్సిజన్ సపోర్ట్, ICU కేర్ అవసరమవుతోంది. దీంతో కోవిడ్-19 మహమ్మారి నాటి రోజులు గుర్తుకొస్తున్నాయి. హెచ్‌ఎంపీ వైరస్‌ను త్వరగా గుర్తించేందుకు ఈ ఆసుపత్రులకు అదనపు టెస్టింగ్ కిట్‌లను సేకరించి, పంపిణీ చేయనున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో HMPV కేసులకు ట్రీట్‌మెంట్ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఒక సర్క్యులర్ జారీ చేసింది.
సోమవారం బెంగళూరులో ఇద్దరు పసికందులు శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షల్లో వారికి హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్లు గుర్తించారు. తరువాత ట్రీట్‌మెంట్ ఇవ్వగా మూడు నెలల చిన్నారి కోలుకుని, ఇప్పటికే ఆసుపత్రి నుంచి డిశ్చార్చ్ కాగా, మరో చిన్నారి కూడా త్వరగా కోలుకుంటున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. భారత్‌లోని తొలి హెచ్ఎంపీవీ కేసులు ఇవేనని భారతీయ వైద్య పరిశోధన మండలి ICMR పేర్కొంది. చైన్నైలో మరో ఇద్దరు శిశువులకు ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు. వారు జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. అలాగే రాజస్థాన్‌కు చెందిన 2 నెలల శిశువు కూడా ఈ వైరస్ బారిన పడింది. వీరందరికీ ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వీరందరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
గుజరాత్‌లో సోమవారం HMPV కేసు నమోదు కాగా.. ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గాంధీనగర్, అహ్మదాబాద్, రాజ్‌కోట్ ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసింది. మొత్తం 45 బెడ్లు ఏర్పాటు చేసినట్లు ఆరోగ్య శాఖ ప్రకటనలో తెలిపింది. రెండు వారాల క్రితం అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన 2 నెలల బాబుకు HMPV అని సోమవారం తేలింది.