CJI Chandrachud: బాధపెట్టి ఉంటే మన్నించండి -సీజేఐ చంద్రచూడ్
వృత్తిపరంగా తాను సంతృప్తి చెందానన్న చంద్రచూడ్;
రేపటి నుంచి తాను సర్వోన్నత న్యాయస్థానం నుంచి తీర్పులు ఇవ్వలేనన్నది వాస్తవం... అయితే తాను వృత్తిపరంగా మాత్రం చాలా సంతృప్తి చెందానని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ అన్నారు. ఆయనకు సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ రోజు ఘనంగా వీడ్కోలు పలికింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చంద్రచూడ్‌కు ఈరోజు చివరి పనిదినం. ఆయన నవంబర్ 10న పదవీ విరమణ చేయనున్నారు. సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులైన విషయం తెలిసిందే. నవంబర్ 11న జస్టిస్ సంజీవ్ ఖన్నా సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ గతంలోనే వెల్లడించారు. 2025 మే 13 వరకు సంజీవ్ ఖన్నా సీజేఐగా కొనసాగుతారు.
జస్టిస్ సంజీవ్ ఖన్నా ఏమన్నారంటే
సుప్రీంకోర్టును మరింత మెరుగుపర్చాలనే లక్ష్యంతో జస్టిస్ డీవై చంద్రచూడ్ పని చేశారని జస్టిస్ సంజీవ్ ఖన్నా పేర్కొన్నారు. ఆయన 38 రాజ్యాంగ ధర్మాసన తీర్పులు ఇచ్చారని ఈ రికార్డును ఎవరూ అధిగమించలేరని పేర్కొన్నారు.
పదవీకాలంలో కీలక తీర్పులు
జస్టిస్ చంద్రచూడ్ 2022 నవంబర్ 8న సీజేఐగా బాధ్యతలు స్వీకరించారు. ఆర్టికల్ 370 రద్దును సమర్థించడం, ఎన్నికల బాండ్లను రద్దు చేయడం, జైల్ మాన్యువళ్లలో కులవివక్షను రద్దు చేయడం, స్వలింగ వివాహాలకు చట్టబద్ధతను నిరాకరించడం వంటి కీలక తీర్పులు ఆయన నేతృత్వంలోని ధర్మాసనాలు ఇచ్చారు. కళ్లకు గంతలు తొలగించి, చేతిలో ఖడ్గం బదులు రాజ్యాంగంతో న్యాయదేవతకు కొత్త రూపాన్ని ఇవ్వడంలో కీలకంగా వ్యవహరించారు.