Maharastra: తోటి విద్యార్థిని బెదిరించి లక్షలు కొట్టేసిన స్నేహితుడు
చంపేస్తానని బెదిరించడంతో రూ. 10 లక్షలు ఇచ్చేసిన బాలుడు;
చంపేస్తానని బెదిరించి స్నేహితుడి నుంచి లక్షలు గుంజాడు ఓ బాలుడు. తమ ఇంటి లాకర్ నుంచి పెద్దమొత్తంలో డబ్బులు మాయం కావడంతో అనుమానం వచ్చిన బాధిత బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. డబ్బులు ఇచ్చిన విద్యార్థి చదువుతున్నది తొమ్మిదవ తరగతి కాగా తీసుకున్నవాడు చదువుతున్నది పదో తరగతి.
గత కొంతకాలంగా క్రైమ్ చేయడానికి వయసుతో సంబంధం లేకుండా పోయింది. సినిమాల ప్రభావమా చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావమా తెలియదు కానీ చిన్న వయసులోనే పిల్లలు తప్పు దారులు పడుతున్నారు. మహారాష్ట్రలోని సోలాపూర్‌లో జరిగిందీ ఘటన.
బాధితుడి తల్లి ఒక స్కూల్ టీచర్.. అదే స్కూల్ లో కొడుకు 9 వ తరగతి చదువుతున్నాడు. నిందితుడు కూడా అదే స్కూల్ లో 10వ తరగతి చదువుకుంటున్నారు. ఇద్దరు బాలురు స్నేహితులుగా ఉన్నప్పుడు పదో తరగతి కుర్రాడు కొంత మొత్తం అప్పు అడిగాడు. అలా ఇచ్చిన రూ. 500 తిరిగి ఇవ్వకపోవడంతో మళ్లీ డబ్బులు అడిగినా ఇచ్చేందుకు నిరాకరించాడు బాధితుడు. దీంతో కక్ష పెంచుకున్న నిందితుడైన పదో తరగతి బాలుడు డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తానని బెదిరించాడు. దీంతో భయపడిన బాధిత బాలుడు తల్లి లాకర్ నుంచి డబ్బులు తీసి ఇవ్వడం మొదలుపెట్టాడు. ఒకటి రెండు కాడు ఏకంగా 10 లక్షలు ఇచ్చేశాడు. అంతేకాదు, జరిగిన విషయాన్ని బాధిత బాలుడు తన బంధువైన వ్యక్తితో చెప్పగా అతడు కూడా రివర్స్ అయ్యాడు.. తనకు కూడా మరో రెండు లక్షలు ఇవ్వాలని బెదిరించినట్టుగా పోలీసులు తెలిపారు.
ఓ రోజు బాధితతుడి తల్లి తన లాకర్‌ను చెక్ చేయగా పెద్దమొత్తంలో డబ్బు మాయమైన విషయాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పదో తరగతి బాలుడితోపాటు రెండు లక్షలు ఇవ్వాలని బెదిరించిన బాధిత బాలుడి బంధువును కూడా అరెస్ట్ చేశారు.