ముడా కుంభకోణం .. విచారణకు సిద్ధంగా ఉన్నా : సీఎం సిద్ధరామయ్య

Update: 2024-09-25 13:15 GMT

ముడా కుంభకోణంలో తాను విచారణ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఈ విషయంలో తానేమీ భయపడటం లేదని చెప్పారు. ముడా స్కామ్‌పై బెంగళూరు ప్రత్యేక కోర్టు విచారణకు ఆదేశించింది. కర్ణాటక లోకాయుక్త అధికారి ఆధ్వర్యంలో దర్యాప్తునకు కోర్టు అనుమతించింది. మూడు నెలల్లోగా ముడా స్కామ్‌పై పూర్తిగా దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని మైసూర్‌ పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీఎం తాజాగా స్పందించారు. ‘నేను ఈ కేసులో పోరాడతాను. దేనికి భయపడను. విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా. న్యాయపరంగా ఎదుర్కొంటాను’ అని పేర్కొన్నారు. ఈ కేసులో సిద్ధరామయ్యకు మంగళవారం హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఈ కుంభకోణానికి సంబంధించి తనను విచారించేందుకు గవర్నర్ అనుమతి మంజూరుచేయడాన్ని సీఎం హైకోర్టులో సవాల్ చేయగా.. ఆ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. గవర్నర్ థావర్‌చంద్‌ గహ్లోత్‌ చర్యలు చట్టప్రకారం ఉన్నాయని కోర్టు స్పష్టం చేసింది. ఆయన చర్యల్లో ఎలాంటి లోపాలు లేవని, ఈ కేసులో పేర్కొన్న అంశాలు విచారణ చేయాల్సి ఉందని పేర్కొంది.

Tags:    

Similar News