LPG Price : వరుసగా రెండో నెలలో కూడా 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. ఐఓసీఎల్ అందించిన సమాచారం ప్రకారం.. డిసెంబర్ 1, 2025 నాటికి దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో ఈ సిలిండర్ ధర దాదాపు రూ.10 తగ్గింది. ఈ తగ్గింపు తర్వాత దేశ రాజధాని న్యూ ఢిల్లీలో ధర రూ.1,580.50గా (రూ.10 తగ్గి) ఉంది. కోల్‌కతాలో కూడా రూ.10 తగ్గి రూ.1,684.00గా ఉంది. ఇక ముంబైలో రూ.10.50 తగ్గి రూ.1,531.50గా, చెన్నైలో రూ.10.50 తగ్గి రూ.1,739.50గా ఉంది.
హైదరాబాద్‌లో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,811.50గా ఉంది. ఈ కమర్షియల్ సిలిండర్ల ధరలు తగ్గడం వలన హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వాణిజ్య వినియోగదారులకు కొంత ఉపశమనం లభించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ, రూపాయి విలువ బలహీనపడటం వల్ల ధరల్లో భారీ మార్పు రాలేదని నిపుణులు అంటున్నారు.
గృహ అవసరాలకు ఉపయోగించే 14.2 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో చివరిసారిగా ధరలను సవరించారు, అప్పుడు సిలిండర్‌కు రూ.50 పెరిగింది. ప్రస్తుత ధరలను పరిశీలిస్తే, న్యూ ఢిల్లీలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.853.00గా ఉంది. కోల్‌కతాలో ఈ ధర రూ.879.00గా, ముంబైలో రూ.852.50గా, చెన్నైలో రూ.868.50గా ఉంది. హైదరాబాద్‌లో 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.905.00గా ఉంది. ఈ ధర గత కొన్ని నెలలుగా స్థిరంగా కొనసాగుతోంది.