అమెరికా సుంకాల సంక్షోభం మధ్య ప్రధానమంత్రి మోడీ రైతులు, మత్స్యకారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కీలక ప్రకటన చేశారు. రైతుల ప్రయోజనాలే మాకు అత్యంత ప్రాధాన్యమని ప్రధాని అన్నారు. రైతుల ప్రయోజనాలకు సంబంధించి భారత్ ఎప్పుడూ రాజీపడదని అన్నారు. ప్రభుత్వంపై భారం పడుతుందని తెలిసినా.. రైతుల కోసం దానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఎంఎస్ స్వామినాథన్ జయంతి ఉత్సవాల్లో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయంపై ఖర్చును తగ్గించడం, కొత్త ఆదాయ వనరులను సృష్టించడం వంటి లక్ష్యాలపై మేము నిరంతరం కృషి చేస్తున్నాము. మా ప్రభుత్వం రైతుల బలాన్ని దేశ పురోగతికి ఆధారంగా పరిగణించింది.
కాగా ట్రంప్ భారత్‌పై 50శాతం టారిఫ్‌లు విధించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో భారతీయ వస్త్ర పరిశ్రమ, ఆక్వా రంగం, తోలు ఉత్పత్తులపై భారీ ప్రభావం పడనుంది. ముఖ్యంగా రొయ్యలు, జంతు సంబంధ ఉత్పత్తులపై అదనపు భారం పడుతుంది. మన దేశం నుంచి ఎగుమతి అయ్యే వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు తగ్గించాలని అమెరికా చాలాకాలంగా డిమాండ్ చేస్తోంది.అది ఆమోదిస్తే.. దేశంలోని రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయనే ఆందోళనలు ఉన్నాయి. దీంతో వ్యవసాయ ఉత్పత్తులపై సుంకం మినహాయింపునకు భారత్ ససేమిరా అంది. దీంతో అగ్రరాజ్యం ఆగ్రహించినట్లు తెలుస్తోంది.