కేంద్ర ఎన్నికల కమిషన్ పై లీగల్ ఫైట్ చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ హెచ్చరించింది. తాము చేసిన ఆరోపణలను తోసిపుచ్చుతూ ఈసీ చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పలు వివరాలతో కూడిన ఓ లేఖను ఈసీకి కాంగ్రెస్ పార్టీ పంపించింది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేతలు జైరాం రమేష్, కేసీ వేణుగోపాల్, అశోక్ గెహ్లాట్, భూపిందర్ హుడా, అజయ్ మాకెన్, అభిషేక్ సింఘ్వి, ఉదయ్ భాన్, ప్రతాప్ బజ్వా, పవన్ భేరా తదితరులు సంతకం చేశారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, ఈవీఎంలలో సాంకేతిక లోపాలు చోటుచేసుకున్నాయంటూ కాంగ్రెస్ చేసిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ఇటీవల తోసిపుచ్చింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ తాజాగా ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. ఈసీ స్పందనను చూసి తామేమీ పెద్దగా ఆశ్చర్యపోలేదని పేర్కొన్నది. మేం ఫిర్యాదు ఇవ్వగా.. తనకు తానే క్లీన్ చిట్ ఇచ్చుకున్నదని విమర్శించింది. ఈ సమయంలో ఈసీ స్పందించేందుకు వాడిన పదజాలంపై కాంగ్రెస్ మండిపడింది. ఫిర్యాదు చేసిన తమ పార్టీని కించపరిచేలా ఈసీ పదజాలాన్ని ప్రయోగించడం సరికాదని తెలిపిన కాంగ్రెస్ అధినాయకత్వం.. ఇకముందు కూడా ఇదే ధోరణిని కొనసాగిస్తే లీగల్ గా ప్రొసీడ్ అయి న్యాయం పొందాల్సి ఉంటుందని తెలిపింది. కేంద్ర ఎన్నికల సంఘానికి ఎవరు ఇలాంటి గైడెన్స్ ఇస్తున్నారో అర్థం కావడం లేదన్న కాంగ్రెస్.. అడ్మినిస్ట్రేటివ్, క్వాసీ జ్యుడీషియల్ విధులను నిర్వర్తించాల్సి ఉంటుందనే విషయాన్ని ఈసీ మర్చిపోయినట్టుందని ఎద్దేవా చేసింది.