Corruption Case: 5 కోట్ల నగదు, కిలోన్నర బంగారం, లగ్జరీ కార్లు..

పంజాబ్‌లో అవినీతి తిమింగలం

Update: 2025-10-17 03:15 GMT

పంజాబ్‌లో అవినీతి తిమింగలం చిక్కింది. రూ.8 లక్షల లంచం కేసులో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (DIG) ఆఫ్‌ పోలీస్‌ హర్‌చరణ్ సింగ్ భుల్లార్‌ (Harcharan Singh Bhullar) కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ (CBI)కి పట్టుబడ్డారు. ఈ సందర్భంగా పంజాబ్‌, చండీగఢ్‌లో ఆయనకు సంబంధించిన ఇండ్లల్లో అధికారులు తనిఖీలు చేశారు. దీంతో విస్తుపోయే విషయాలు వెలుగులోకివచ్చాయి.

2023లో మండి గోబింద్‌గఢ్‌కు చెందిన తుక్కువ్యాపారి ఆకాశ్‌ భట్టాపై కేసు నమోదయింది. ఈ కేసు మాఫీ చేసేందుకు నెలవారీ మామూళ్లతోపాటు రూ.8 లక్షల లంచం ఇవ్వాలని డీఐజీ హర్‌చరణ్‌ డిమాండ్‌ చేశారు. మధ్యవర్తిగా వ్యవహరించిన కృష్ణ అనే వ్యక్తి ఇరువురి మధ్య డీల్‌ ఓకే చేశారు. అయితే ఆకాశ్‌ సీబీఐని ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు డీఐజీపై నిఘాపెట్టారు. ఈ క్రమంలో చండీగఢ్‌లో ఆకాశ్‌ నుంచి డీఐజీ తరపున రూ.8 లక్షలు తీసుకుంటుండగా కిషన్‌ను అధికారులు గురువారం పట్టుకున్నారు.

ఇరువురి నుంచి తగిన ఆధారాలు సేకరించిన తర్వాత డీఐజీని కూడా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం డీఐజీ కార్యాలయంతోపాటు రోపార్‌, మొహాలి, చండిగఢ్‌లోని భల్లార్‌ నివాసాల్లో తనిఖీలు జరుపగా సుమారు రూ.5 కోట్ల నగదు, 1.5 కిలోల బంగారు ఆభరణాలు, స్థిరాస్తి పత్రాలు, మెర్సెడెస్‌, ఆడీ కార్ల తాళాలు, 22 లగ్జరీ గడియారాలు, లాకర్ తాళాలు, 40 లీటర్ల దిగుమతి చేసిన మద్యం, డబుల్ బ్యారెల్ గన్, పిస్టల్, రివాల్వర్, ఎయిర్‌గన్‌తో సహా తుపాకులు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కృష్ణ నుంచి రూ.21 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని సీబీఐ అధికారులు వెల్లడించారు. ఇద్దరు నిందితులను శుక్రవారం కోర్టులో హాజరుపరుస్తామన్నారు.

2009 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ ఆఫీసర్‌ అయిన భుల్లార్‌ ప్రస్తుతం రోపర్ రేంజ్ డీఐజీగా విధులు నిర్వహిస్తున్నారు. అంతకుముందు విజిలెన్స్‌ జాయింట్‌ డైరెక్టర్‌గా, మొహాలి, సంగ్రూర్‌, ఖన్నా, హోషియార్పూర్‌, ఫతేగఢ్‌ సాహిబ్‌, గురుదాస్‌పూర్‌లో సీనియర్‌ సూపరింటెండెంట్‌గా పనిచేశారు.

Tags:    

Similar News