Navneet Rana: ఎంపీ దంపతులు నవనీత్ కౌర్ రాణాకు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ..

Navneet Rana: అరెస్ట్‌ అయిన మహారాష్ట్ర అమరావతి ఎంపీ నవనీత్‌ రాణా దంపతుల బెయిల్‌ పిటిషన్‌ శుక్రవారం విచారణకు రానుంది.

Update: 2022-04-25 11:15 GMT

Navneet Rana: హనుమాన్‌ చాలీసా పారాయణ వివాదంలో అరెస్ట్‌ అయిన మహారాష్ట్ర అమరావతి ఎంపీ నవనీత్‌ రాణా దంపతుల బెయిల్‌ పిటిషన్‌ వచ్చే శుక్రవారం విచారణకు రానుంది. ఎంపీ నవనీత్‌ కౌర్‌ దంపతులకు బాంద్రా మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. నవనీత్‌ కౌర్‌ను బైకుల్లా జైలుకు, రవి రాణాను ఆర్థర్‌ రోడ్డు జైలుకు తరలించారు. హిందుత్వను మరచిపోయిన సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ఇంటి ముందు చాలీసా చదువుతామంటూ నవనీత్‌ రాణా దంపతులు ప్రకటించారు.

దీనిపై మండిపడిన శివసేన కార్యకర్తలు హనుమాన్‌ చాలీసా పుస్తకాలతో ఉద్ధవ్‌ ఇంటికి వెళ్లారు. దీంతో నవనీత్‌ కౌర్‌ వెనక్కి తగ్గారు. ప్రధాని మోదీ ముంబై పర్యటనకు వస్తున్నందున చాలీసా పారాయణ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అయినప్పటికీ, శివసేన కార్యకర్తలు శాంతించలేదు. నవనీత్‌ కౌర్ ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. దీంతో రెండు వర్గాల మధ్య చిచ్చు పెడుతున్నారన్న అభియోగంతో నవనీత్‌ కౌర్‌ దంపతులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు పోలీసులు. 

మరోవైపు తమ ఇంటిపై దాడికి శివసేన కార్యకర్తలను సీఎం ఠాక్రేనే పంపించారంటూ నవనీత్ కౌర్ ఆరోపించారు. పోలీస్‌ స్టేషన్‌లో శివసేన కార్యకర్తలపై కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఈ కేసులో 13 మంది శివసేన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరికి బెయిల్ రావడంతో విడుదలయ్యారు. మరోవైపు నవనీత్‌కౌర్‌ దంపతులను కస్టడీకి అప్పగించాలన్న ముంబై సిటీ పోలీసుల వినతిని కోర్టు తిరస్కరించింది.

Tags:    

Similar News