Donald Trump: కర్ణాటకలో సైబర్ క్రైమ్ ..ట్రంప్ పేరుతో 150 మందికి కుచ్చుటోపీ ..
రూ.కోటికి పైగా వసూలు చేసి పరారైన మోసగాళ్లు;
సైబర్ నేరగాళ్లు టెక్నాలజీని వాడుకొని ప్రజలను మోసం చేస్తున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరుతో కర్ణాటక లో దాదాపు 150 మందిని నమ్మించి రూ.కోటికి పైగా దోచుకొన్నారు. సైబర్ మోసగాళ్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నట్లు వీడియోలను సృష్టించారు.
తాను ట్రంప్ పేరుతో యాప్‌ను రూపొందించానని, పెట్టుబడులు పెట్టాలని తద్వారా అధిక లాభాలు గడించవచ్చని అమెరికా అధ్యక్షుడు సూచిస్తున్నట్లు ఉన్న పలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో కర్ణాటకలోని తుమకూరు, బెంగళూరు, హవేరి ప్రాంతాలలోని దాదాపు 150 మంది ఆ వీడియోలను నమ్మి, అందులో ఉన్న ఫోన్ నెంబర్‌కు కాల్ చేసి, యాప్‌లో పెట్టుబడులు పెట్టారు. వారికి నేరగాళ్లు యూఎస్ ప్రభుత్వానివే అని నమ్మించేలా ధ్రువీకరణ పత్రాలు కూడా జారీ చేశారు.
వారు పెట్టిన పెట్టుబడులకు లాభాలు వచ్చినట్లు కొద్ది నెలలపాటు చూపిస్తూ.. డబ్బు, ఇతర బహుమతులు అందించారు. కొద్ది రోజులకు యాప్ నిర్వాహకులు తమ కాల్స్‌కు సమాధానం ఇవ్వకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. సైబర్ మోసగాళ్ల వలలో పడి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 150 మంది కోటి రూపాయలకు పైగా విలువైన డబ్బు పోగొట్టుకున్నట్లు గుర్తించామని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇలాంటి నకిలీ యాప్‌లు, కంపెనీల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, సైబర్ మోసగాళ్ల వలలో పడొద్దని సూచించారు.