VIJAY: విజయ్ ప్రచార సభలో మృత్యు మృదంగం
తమిళనాట తీవ్ర విషాదం మిగిల్చిన ప్రచారసభ.. టీవీకే పార్టీ ప్రచారానికి పోటెత్తిన జన సందోహం.. తొక్కిసలాటలో సహా 38 మంది మృతి.. మృతుల్లో 8 మంది చిన్నారులు, 16 మంది మహిళలు
తమిళనాడులో ఘోరం చోటు చేసుకుంది. టీవీకే చీఫ్ దళపతి విజయ్ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 38 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా చాలా మందికి గాయాలైనట్లు తెలిపారు. వచ్చే ఏడాది తమిళనాడులో జరగనున్న శాసనసభ ఎన్నికలకు సిద్ధమవుతున్న విజయ్ ఈ నెల 13న రాష్ట్రవ్యాప్త ప్రచారయాత్రను ప్రారంభించారు. శనివారాల్లో మాత్రమే రెండేసి జిల్లాల్లో ప్రచారం చేస్తున్నారు. ఈ శనివారం నామక్కల్‌లో ఉదయం ప్రచారం చేపట్టి సాయంత్రం కరూర్ చేరుకున్నారు. అక్కడి వేలుసామిపురంలో రాత్రి 7.30 గంటలకు విజయ్ ప్రసంగిస్తుండగా ఆయనకు సమీపంగా వచ్చేందుకు పలువురు ప్రయత్నించారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. పిల్లలు, మహిళలు, వృద్ధులు అందులో చిక్కుకున్నారు. ఒకరి తర్వాత ఒకరు స్పృహతప్పి పడిపోవడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. ఉద్రిక్తత చోటుచేసుకుంది. 8 మంది చిన్నారులు, 16 మంది మహిళలు సహా 38 మంది మరణించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పరిస్థితిని అంచనా వేసిన విజయ్ తన ప్రసంగాన్ని నిలిపివేసి తోసుకోవద్దంటూ వారించే ప్రయత్నం చేశారు. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోవడంతో సహాయక చర్యలకు ఆదేశించారు. సమీపాన ఉన్న అంబులెన్స్ వద్దకు బాధితులను తీసుకెళ్లడానికి కార్యకర్తలు ప్రయత్నించినా రద్దీ మధ్యలో నుంచి వెళ్లడానికి వెంటనే సాధ్యపడలేదు. బాధితులను పైకెత్తిపట్టుకుని రద్దీలో అతికష్టంపై ముందుకు సాగారు.
అంబులెన్స్‌ల్లో సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. ఘటనాస్థలికి మరికొన్ని అంబులెన్సులు రావడంతో వాటి ద్వారానూ బాధితులను తీసుకెళ్లారు. అయినప్పటికీ నిమిషాల వ్యవధిలో 38 ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. 50 మందికి పైగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో 20 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కరూర్‌లోని ఆసుపత్రుల వద్ద మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరోవైపు.. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేసిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. నేడు అక్కడ పర్యటించనున్నారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.లక్ష పరిహారం ప్రకటించారు. హైకోర్టు రిటైర్ట్ జడ్జీ జస్టిస్ అరుణ జగదీశన్ ఆధ్వర్యంలో ఏక సభ్య కమిటీ ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. కొన్ని నెలల క్రితం.. మధురైలో నిర్వహించిన తొలి సభలోనే తొక్కిసలాట చోటు చేసుకుంది.