Delhi Blast Compensation: ఢిల్లీ పేలుడు బాధితులకు ఆర్థిక సహాయం.. రూ. 10 లక్షల పరిహారంపై పన్ను కట్టాలా?

Update: 2025-11-12 06:15 GMT

Delhi Blast Compensation: సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలో జరిగిన పేలుడు ఘటన దేశ రాజధానిలో కలకలం సృష్టించింది. ఈ విషాదకర సంఘటనలో బాధితులు, వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు ఢిల్లీ ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, గాయపడిన వారికి రూ. 5 లక్షల వరకు పరిహారాన్ని ప్రకటించారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన ఈ ఆర్థిక సహాయం పై ఆదాయపు పన్ను వర్తిస్తుందా లేదా అనే సందేహం చాలామందికి ఉంటుంది.

ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు దుర్ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తక్షణమే స్పందించారు. పేలుడులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు ప్రకటించారు. అలాగే, శాశ్వత వైకల్యం పొందిన వారికి రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందిస్తారు.

ఈ ఘటనలో గాయపడిన వారందరికీ వైద్య చికిత్స ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని, వారికి నాణ్యమైన చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఈ సహాయాన్ని ప్రకటించడం వెనుక ముఖ్య ఉద్దేశం.. బాధితుల ఆర్థిక భారాన్ని తగ్గించడం, వారి తక్షణ వైద్య, పునరావాస ఖర్చులకు మద్దతు ఇవ్వడం. పరిహారం అనేది ప్రభుత్వం లేదా సంస్థలు అందించే ఒక రకమైన ఆర్థిక ఉపశమనం.

పరిహారం అనేది ఏదైనా చట్టపరమైన బాధ్యత లేకుండా, ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు లేదా విషాదకర సంఘటనల తర్వాత ప్రభావిత వ్యక్తులకు లేదా వారి కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించడానికి స్వచ్ఛందంగా ప్రకటించే మొత్తం. ఈ చెల్లింపులు ఆకస్మికంగా సంభవించిన నష్టాల నుంచి బాధితులకు త్వరగా కోలుకోవడానికి, పునరావాసం పొందడానికి ఉపయోగపడతాయి.

ప్రభుత్వం ప్రకటించిన ఈ ఆర్థిక సహాయంపై పన్ను వర్తిస్తుందా అనే సందేహానికి పన్ను నిపుణులు స్పష్టత ఇచ్చారు. పన్ను నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ మొత్తానికి పన్ను మినహాయింపు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థానిక సంస్థల నుంచి అందుకున్న ఏ విధమైన పరిహారానికైనా పన్ను నుంచి పూర్తి మినహాయింపు ఉంటుంది. ఈ మొత్తం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 10(BC) కింద పన్ను మినహాయింపు పొందుతుంది. ఈ మినహాయింపు వర్తించాలంటే ఈ సంఘటన విపత్తు నిర్వహణ చట్టం, 2005 పరిగణలోకి రావాలి. ఈ పేలుడు వంటి తీవ్రమైన సంఘటనలకు ప్రభుత్వ సహాయం పన్ను కోత లేకుండా బాధితులకు పూర్తిగా అందుతుంది.

Tags:    

Similar News