Delhi Blast: ఎర్రకోట పార్కింగ్‌లో బాంబు తయారు ? దర్యాప్తులో వెలుగులోకి కీలక విషయం
మీడియాలో కథనాలు
దేశ రాజధాని ఢిల్లీలో పేలుడుఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ముఖ్యంగా దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్ ఉన్ నబీ మూడు గంటలపాటూ ఎర్రకోట సమీపంలోని పబ్లిక్ పార్కింగ్ స్థలంలో ఏం చేశాడన్నదానిపై విచారణ చేస్తున్నారు. ఈ విచారణలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఉమర్ పార్కింగ్‌లోనే బాంబు తయారు చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.
దర్యాప్తులో భాగంగా పార్కింగ్ స్థలానికి సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను దర్యాప్తు బృందం పరిశీలించింది. డాక్టర్ ఉమర్ 10వ తేదీన మధ్యాహ్నం 3:19 గంటలకు పార్కింగ్ స్థలంలోకి వెళ్లి సాయంత్రం 6:28 గంటలకు బయటకు వచ్చినట్లుగా సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించింది. ఆ మూడు గంటలు అతడు కారులోనే ఉండి పేలుడు పదార్థాన్ని తయారు చేసినట్లుగా గుర్తించారు . పార్కింగ్ స్థలంలో ఉన్నంతసేపు ఉమర్ ఒక్కసారి కూడా కారు దిగలేదని దర్యాప్తులో తేలింది.
మరోవైపు ఎర్రకోట వద్ద పేలుడుకు రెండు కిలోలకు పైగా అమ్మోనియం నైట్రేట్ (Ammonium Nitrate) ఉపయోగించినట్లు దర్యాప్తు అధికారులు ఇప్పటికే గుర్తించిన విషయం తెలిసిందే. ఘటనాస్థలి నుంచి సేకరించిన దాదాపు 52కిపైగా పేలుడు పదార్థాల నమూనాలను ఫోరెన్సిక్ బృందం పరిశీలించింది. ఎర్రకోట (Red Fort) వద్ద పేలుడుకు పెట్రోలియం వంటివి కూడా ఉపయోగించి పేలుడు పదార్థాన్ని తయారు చేసినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఇలాంటి పేలుడు పదార్థాలను కేవలం 5 నుంచి 10 నిమిషాల్లోనే తయారు చేయొచ్చని ఫోరెన్సిక్ వర్గాలు వెల్లడించాయి.