Arvind Kejriwal: సుప్రీం కోర్టులో అర్వింద్ కేజ్రీవాల్‌కు షాక్
బెయిల్ పొడిగింపు పిటిషన్‌పై తక్షణ విచారణకు వెకేషన్ బెంచ్ నిరాకరణ;
మద్యం కుంభకోణం కేసులో బెయిల్ పొడిగింపు కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌కు చుక్కెదురైంది. బెయిల్ పొడిగింపు పిటిషన్ పై తక్షణ విచారణ కోరుతూ ఆయన తరపు లాయర్ అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం వెకేషన్ బెంచ్ తిరస్కరించింది. ఈ పిటిషన్ గురించి గత వారం ప్రధాన బెంచ్ ముందుకు ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించింది. ఈ కేసులో తీర్పు రిజర్వ్ లో ఉన్నందున పిటిషన్ లిస్టింగ్ పై తగు నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ కేసులో జూన్ 1 వరకూ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. జూన్ 2న ఆయన లొంగిపోవాల్సి ఉంది.
అయితే, వైద్య పరీక్షల నిమిత్తం బెయిల్‌ను మరో ఏడు రోజుల పాటు పొడిగించాలంటూ కేజ్రీవాల్ సోమవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన బరువు నెల రోజుల వ్యవధిలో అకారణంగా 7 కేజీల మేర తగ్గిందన్నారు. ఇది తీవ్ర అనారోగ్య సమస్యకు సంకేతమని ఆందోళన వ్యక్తం చేశారు. పెట్ స్కాన్ సహా పలు ఇతర వైద్య పరీక్షల కోసం ఏడు రోజుల సమయం పడుతుందని, ఇందుకు అనుగుణంగా బెయిల్ పొడిగించాలని కోరుతూ సుప్రీంను ఆశ్రయించినట్టు తెలిపారు. కీటోన్ స్థాయిలు పెరిగాయని.. అందుకే తాను పీఈటీ-సీటీ స్కాన్ సహా పలు పరీక్షలు చేయించుకోవాల్సి ఉందన్నారు. ఈ క్రమంలోనే వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వీలుగా తన మధ్యంతర బెయిల్ గడువును మరో 7 రోజులు పొడిగించాలని సుప్రీం ధర్మాసనాన్ని తన పిటిషన్‌లో కోరారు.
కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ అరెస్టైన విషయం తెలిసిందే. మార్చి 21న ఈడీ(ED) అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆయన జ్యుడీషియల్ కస్టడీలో తీహార్ జైలులో ఉన్నారు. దాదాపు 50 రోజులపాటు జైల్లో ఉన్న ఆయనకు లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. జూ 1 వరకూ బెయిల్ మంజూరు చేసింది. ఇక జూన్ 2న ఆయన లొంగిపోవాల్సి ఉంది.