Delhi Pollution : ప్రమాదకర స్థాయిలో ఢిల్లీలో కాలుష్యం..స్కూళ్లకు సెలవులు
ఢిల్లీలో కాలుష్యం మళ్లీ ప్రమాదకరస్థాయికి చేరింది. స్థానిక ప్రజలు ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారింది. కాలుష్యం మితిమీరిన కారణంగా ప్రాథమిక పాఠశాలలన్నింటినీ మూసివేస్తున్నట్లు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేదాకా ఆన్‌లైన్‌లోనే తరగతులు నడుస్తాయని ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ ఎక్స్‌లో వెల్లడించారు. వాయు నాణ్యత సూచీ ఏక్యూఐ వరుసగా రెండో రోజు అత్యంత ప్రమాదకర స్థాయిలో 400 మార్కు దాటడంతో ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. ముఖ్యంగా భవన నిర్మాణ, కూల్చివేత పనులను నిలిపివేశారు. బీఎస్-3 పెట్రోల్, బీఎస్-4 డీజిల్ వాహనాలను రోడ్లపైకి అనుమతించరు. తీవ్ర వాయు కాలుష్యం నేపథ్యంలో ఇప్పటికే సుమారు 350 విమానాలకు అంతరాయం ఏర్పడింది. పలు విమానాలను జైపూర్, లక్నో తదితర నగరాలకు దారి మళ్లించారు. ఢిల్లీకి వచ్చే రైళ్లు కూడా ఆలస్యంగా నడిచాయి.