లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) Xలో స్పందించారు. ‘ప్రజలు వరుసగా మూడోసారి ఎన్డీయేపై విశ్వాసం ఉంచారు. భారతదేశ చరిత్రలో ఇదొక చారిత్రక ఘట్టం. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి గత దశాబ్దంలో చేసిన మంచి పనిని కొనసాగిస్తామని హామీ ఇస్తున్నా. ఈ విజయం కోసం ఎంతో కృషి చేసిన కార్యకర్తలందరికీ నేను సెల్యూట్ చేస్తున్నా. వారిని అభినందించేందుకు మాటలు చాలవు’ అని మోదీ పేర్కొన్నారు.
ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు ప్రధాని మోదీ. ‘ఎన్డీఏ కూటమికి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఈ సంగ్రామంలో సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ గెలిచింది. మూడోసారి ఎన్డీఏ అధికారం చేపట్టబోతోంది. ఎన్నికల ఘట్టాన్ని విజయవంతంగా నిర్వహించిన ఈసీకి అభినందనలు. జమ్మూకశ్మీర్‌లో రికార్డ్ స్థాయిలో ఓటింగ్ జరిగింది. ఇది గర్వించదగ్గ విషయం’ అని మోదీ తెలిపారు.
లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో బీజేపీ క్లీన్‌స్వీప్ దిశగా దూసుకెళ్తోంది. మధ్యప్రదేశ్(29), ఢిల్లీ(7), ఉత్తరాఖండ్(5), హిమాచల్ ప్రదేశ్(4), అరుణాచల్ ప్రదేశ్(2), త్రిపుర(2), అండమాన్ నికోబార్(1)లో ఇప్పటికే కొన్ని స్థానాలు గెలుచుకుంది. మిగతా స్థానాల్లోనూ ఆధిక్యంలో కొనసాగుతూ క్లీన్‌స్వీప్ దిశగా దూసుకెళ్తోంది.