Dharmasthala: ధర్మస్థలలో రెండు అస్థిపంజరాలు లభ్యం.. మహిళలవని ప్రాథమిక అంచనా

కొనసాగుతున్న ప్రత్యేక బృందం దర్యాప్తు;

Update: 2025-08-01 03:15 GMT

కర్ణాటకలోని ప్రసిద్ధ శైవక్షేత్రమైన ధర్మస్థల పరిసరాల్లో పలువురు మహిళలను దారుణంగా హింసించి, కడతేర్చారన్న ఆరోపణలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. వాస్తవాలు వెలికి తీయడానికి రంగప్రవేశం చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) గురువారం కొనసాగించిన పరిశోధనలో పుర్రెలు, ఎముకలు వెలుగు చూడటం సంచలనం సృష్టిస్తోంది. అవి ఇద్దరు మహిళలకు చెందినవి కావచ్చని ప్రాథమికంగా అంచనావేస్తున్నారు. అటవీ ప్రాంతం కావడం, దానికితోడు భారీ వర్షాల వల్ల దర్యాప్తులో జాప్యం జరుగుతోందని సిట్కు నేతృత్వం వహిస్తున్న డాక్టర్‌ ప్రణబ్‌ మొహంతి తెలిపారు.

ధర్మస్థల పరిధిలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేసిన ఒక వ్యక్తి దక్షిణ కన్నడ జిల్లా ఎస్పీ అరుణ్‌కు ఇటీవల ఒక లేఖ రాశారు. ‘గతంలో ఇక్కడ మహిళలు, బాలికలపై ఎన్నో దారుణాలు జరిగాయి. నేనే ఎన్నో శవాలను పూడ్చిపెట్టా’ అంటూ ధర్మస్థలలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన ఒక వ్యక్తి (62) చెప్పడంతో దేశమంతా ఉలిక్కిపడింది. ‘1998 నుంచి 2014 మధ్య వందకు పైగా మృతదేహాలను ఖననం చేశాను. ఆ వ్యక్తులే మా కుటుంబానికి చెందిన యువతిపై అనుచితంగా ప్రవర్తించడంతో మేం దూరంగా వెళ్లిపోయాం. నన్ను పాపభీతి వెంటాడుతోంది. నాకు రక్షణ కల్పిస్తే నాటి ఘటనలను బయటపెడతా’ అని ఆ లేఖలో పేర్కొన్నాడని ఎస్పీ తెలిపారు. ఇదే సమయంలో.. 20 ఏళ్ల కిందట తన కుమార్తె అయిన వైద్యవిద్యార్థిని ధర్మస్థలకు వచ్చి కనిపించకుండా పోయిందని సుజాత భట్ అనే మహిళ ఆరోపించారు. పోలీసులు ఫిర్యాదు కూడా తీసుకోలేదని వెల్లడించారు. ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం జులై 19న నలుగురు ఐపీఎస్‌ల ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. మృతదేహాలను ఖననం చేశానని చెప్పిన వ్యక్తిని వారు విచారించారు. అతడు చెప్పిన 13 చోట్ల ప్రస్తుతం తవ్వకాలు జరుపుతున్నారు. 

దక్షిణ కన్నడ జిల్లాలో ధర్మస్థల ఓ చిన్నగ్రామం. ఎన్నో ఏళ్ల కిందటే ఇక్కడ మంజునాథ స్వామి ఆలయం విస్తరించింది. రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ వీరేంద్ర హెగ్డే ఐదు దశాబ్దాలుగా ఆలయానికి ధర్మాధికారిగా వ్యవహరిస్తున్నారు. గత ఐదు దశాబ్దాల్లో ధర్మస్థల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నో వైద్య కళాశాలలు, ఆయుర్వేద కళాశాలలు, విద్యాసంస్థలు వెలిశాయి. భక్తుల రాకపోకలు పెరిగాయి. అలాంటిచోట తాజా ఆరోపణలు విస్మయం కలిగిస్తున్నాయి. గత పదేళ్లలో ధర్మస్థల, బెళ్తంగడి, ఉజిరె ఠాణాల పరిధిలో 450 మంది అనుమానాస్పదంగా కనిపించకుండాపోయారు. వీటిలో ఒక్క కేసునూ పూర్తి స్థాయిలో విచారించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. పేదలు నోరు మెదపకుండా డబ్బుతో నోరు మూయించారని వామపక్షాలు ఆరోపిస్తున్నాయి. 2014లో కూడా ఒక కళాశాల విద్యార్థిని హత్యాచారానికి గురైంది.


Tags:    

Similar News