దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి కురుస్తున్న వానలు నగరాన్ని అతలాకుతలం చేశాయి. రహదారులన్నీ జలమయమయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నయి. ముంబైలోని పలు శివారు ప్రాంతాలలో నిన్న మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురిసింది. ఇవాళ తెల్లవారుజాము వరకు వాన కురిసింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరి జనజీవనం అస్తవ్యస్తమైంది. పలు చోట్ల రహదారులపైకి వరద నీరు చేయడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. ములుంద్, దాని పరిసరాల్లో భారీ వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి.
ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ఠాణెలోని ముంబ్రా బైపాస్‌పై కొండచరియలు విరిగిపడటంతో ఆ ప్రాంతంలో 3 గంటలకు పైగా ట్రాఫిక్ స్తంభించింది. వర్షాల కారణంగా దాదాపు 14 విమానాలను దారి మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రేపటి వరకు ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ముంబయి, శివారు ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని, అనవసరంగా బయటకు రావొద్దని పోలీసులు కీలక సూచనలు చేశారు.
భారీ వర్షాలు కురిసే కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. ముంబై పొరుగు జిల్లాలను కూడా అప్రమత్తం చేసింది. అత్యంత భారీ వర్షాలు కురవచ్చని, ముంబై, థానే, రాయ్‌గఢ్, రత్నగిరి జిల్లాలకు తీవ్ర భారీ వర్షాల ముప్పు ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. దీంతో తీవ్ర వర్షాలు, వరదల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నగరంలోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు మహారాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది.