West Bengal: మహిళ మృతదేహాన్నితవ్వి తీసి.. సెల్ఫీ
యువకుడిని పట్టుకుని చితక బాదిన గ్రామస్థులు;
క యువకుడు పూడ్చిపెట్టిన మహిళ మృతదేహాన్ని వెలికితీశాడు. ఆ అస్థిపంజరంతో సెల్ఫీ తీసుకున్నాడు. ఇది చూసిన గ్రామస్తులు ఆగ్రహంతో రగిలిపోయారు. అతడ్ని పట్టుకుని కొట్టారు. అక్కడకు చేరుకున్న పోలీసులు అతి కష్టంతో గ్రామస్తుల దాడి నుంచి ఆ యువకుడ్ని కాపాడారు. పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మేదినీపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కాంటాయ్ పరిధిలోని గ్రామానికి చెందిన ప్రభాకర్, ఏడేళ్ల కిందట పూడ్చిపెట్టిన మహిళ మృతదేహాన్ని వెలికితీశాడు. ఆ అస్థిపంజరంతో సెల్ఫీ తీసుకున్నాడు.
కాగా, గ్రామస్తులు ఇది చూసి ఆగ్రహంతో రగిలిపోయారు. ప్రభాకర్‌ను పట్టుకుని కొట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అయితే ప్రభాకర్‌ను పోలీసులకు అప్పగించేందుకు గ్రామస్తులు నిరాకరించారు. అతడ్ని కాపాడేందుకు ప్రయత్నించిన పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈ ఘర్షణలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు.
మరోవైపు రెండు గంటల తర్వాత అక్కడి పరిస్థితిని పోలీసులు నియంత్రించారు. గ్రామస్తుల దాడి నుంచి ప్రభాకర్‌ను కాపాడారు. తీవ్రంగా గాయపడిన అతడ్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనా స్థలంలో మద్యం సీసా లభించడంతో తాగిన అతడు ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే సమాధి నుంచి మహిళ అస్థిపంజరాన్ని ఆ యువకుడు ఎందుకు బయటకు తీశాడో అన్నది తెలియలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.