కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ఆర్థిక సర్వే 2024-25ను ప్రవేశపెట్టారు. అనంతరం సభను స్పీకర్ ఓంబిర్లా రేపటికి వాయిదా వేశారు. శనివారం నిర్మల లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర బడ్జెట్ సమర్పణకు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. గత సంవత్సర కాలంలో దేశ ఆర్థిక పనితీరును.. రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి చెప్పేదే ఈ ఎకనామిక్ సర్వే.
ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన ఎకనామిక్ అఫైర్స్ డిపార్ట్‌మెంట్‌లోని ఎకనామిక్ డివిజన్ ఈ సర్వేను రూపొందిస్తుంది. తొలుత 1950-51 సంవత్సరం నుంచి ఆర్థిక సర్వేను బడ్జెట్‌తో పాటే ప్రవేశపెట్టేవారు. 1960 తర్వాత బడ్జెట్‌కు ఒకరోజు ముందు ప్రవేశపెట్టే సంప్రదాయం మొదలైంది
నిర్మలా సీతారామన్ శనివారం లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇది ఆమె వరుసగా ప్రవేశపెట్టనున్న 8వ బడ్జెట్ కావడం విశేషం. స్వతంత్ర భారత్‌లో మొదటి బడ్జెట్‌ను నవంబర్ 26, 1947న తొలి ఆర్థిక మంత్రి RK షణ్ముఖం చెట్టి ప్రవేశపెట్టారు. అయితే భారతదేశంలో 1857 సిపాయిల తిరుగుబాటు అనంతరం ఏర్పడిన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు బ్రిటిష్ కాలంలో జేమ్స్ విల్సన్ మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టారు.