LS POLLS: అరుణాచల్‌లో అధికారమెవరిది?
పూర్వ వైభవం కోసం కాంగ్రెస్..... మళ్లీ పాగా వేయాలని బీజేపీ;
అరుణాచల్‌లో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. 60 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19వ తేదీన పోలింగ్ జరగనుంది. కాంగ్రెస్‌కు కంచుకోటైన అరుణాచల్ ప్రదేశ్‌లో గత ఎన్నికల్లో బీజేపీ పాగా వేసింది. 2019లో ప్రధాని మోదీ సునామీ ముంచెత్తడంతో బీజేపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు రెండు లోక్‌సభ స్థానాలను గెలుచుకొని హస్తం పార్టీ అధిపత్యానికి గండికొట్టింది. ఈసారి ఎన్నికల ఇంకా జరగక ముందే బీజేపీ ఆధిపత్యం మెుదలైంది. 60 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటికే 10 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవడం గమనార్హం. మిగిలిన 50 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను నిలపగా కాంగ్రెస్ కేవలం 19 సీట్లలోనే పోటీ చేస్తుండడం ప్రస్తుత పరిస్థితికి అద్దంపడుతోంది. 2004 నుంచి 2014 దాకా అరుణాచల్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఆ తర్వాత ప్రభావాన్ని కోల్పోతూ వచ్చింది.
2004లో అరుణాచల్‌లోని రెండు లోక్‌సభ స్థానాలను బీజేపీ గెలుచుకోగా 2009లో కాంగ్రెస్ వశం చేసుకొంది. 2014లో బీజేపీ, కాంగ్రెస్ చెరొకటి గెలుచుకున్నాయి. కానీ 2019లో ప్రధాని మోదీ చరిష్మాతో రెండు స్థానాలను గెలుచుకొని బీజేపీ క్లీన్‌స్వీప్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో సైతం బీజేపీ సత్తాచాటింది. మోదీ హవా, కేంద్ర సంక్షేమ పథకాలు , రాష్ర్ట అభివృద్ధే ప్రచార అస్త్రాలుగా బీజేపీ దూసుకుపోతోంది. చైనాతో సరిహద్దు వివాదం భాజపాకు అడ్డంకిగా మారే అవకాశం ఉంది. అటు బలమైన రాష్ర్ట నాయకత్వం లేకపోవడం కాంగ్రెస్ విజయావకాశాలను తగ్గిస్తోంది.
మణిపుర్‌లో ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో జాతిహింస, అక్రమ వలసలు అత్యంత ప్రభావం చూపే అవకాశం ఉంది. దాదాపు 200 మందికి పైగా ప్రాణాలు బలిగొన్న కుకీ, మైతేయి వర్గాల మధ్య జరిగిన హింస ఈ ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారింది. మణిపుర్‌లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ స్థానాలను నిలుపుకుంటూ వస్తున్న కాంగ్రెస్‌కు2019లో తొలిసారి షాక్ తగిలింది. 2019లో మణిపుర్‌లో ఉన్న రెండు లోక్‌సభ స్థానాల్లో ఒకటి బీజేపీ, మరొకటి నేషనల్ పీపుల్స్ ఫ్రంట్-NPF గెలుచుకొని కాంగ్రెస్‌కు షాకిచ్చాయి. 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు చుక్కెదురైంది. 60 అసెంబ్లీ స్థానాల్లో 32 స్థానాలను కైవసం చేసుకుని సొంతంగా బీజేపీ మెజారిటీ దక్కించుకుంది. ప్రాంతీయ పార్టీలైన NPF, NPP, లోక్ జనశక్తి పార్టీలతో కలిసి బీరెన్ సింగ్ సీఎంగా బీజేపీ సర్కారు కొలువుదీరింది. అయితే, ఈసారి ఎన్నికల్లో కుకీ, మైతేయి వర్గాల మధ్య హింస అధికార బీజేపీ విజయావకాశాలను దెబ్బకొట్టే అవకాశం ఉంది. రెండు తెగల మధ్య చెలరేగిన హింస దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. అత్యాచారాలు, సజీవ దహనాలతో మణిపుర్ అట్టుడికింది. అల్లర్లు కట్టడి చేయడంలో భాజపా సర్కారు విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ప్రధాని మోదీ ఒక్కసారి కూడా మణిపుర్‌లో పర్యటించలేదంటూ దుమ్మెత్తిపోస్తున్నాయి. హింసకు ప్రధాన కారణం అక్రమ వలసలంటున్న ప్రభుత్వం సరిహద్దుల వెంబడి కంచెలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అక్రమ వలసలను ఆరికట్టడానికి స్వేచ్ఛాయుత రాకపోకల విధానాన్ని కేంద్రం రద్దు చేసింది. దీనిని ఆదివాసీలు, గిరిజనులు వ్యతిరేకించగా, మైతేయి తెగ స్వాగతించింది. మణిపుర్ జనాభాలో దాదాపు 53 శాతం మైతేయి తెగవారు ఉండగా, దాదాపు 40 శాతం కుకీ, నాగా తెగలు ఉంటున్నారు. మణిపుర్‌లో ఏప్రిల్ 19, 26 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది.