Learjet 45 : ప్రాణాలు తీసే లియర్ జెట్ 45.. 200 ప్రమాదాలు జరిగినా ఇంకా ఎందుకు వాడుతున్నారు?

Update: 2026-01-28 08:55 GMT

Learjet 45 : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రాణాలు తీసిన విమానం లియర్ జెట్ 45 పై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఇది కేవలం ఒక ప్రమాదం మాత్రమేనా? లేక ప్రాణాలు తీసే యంత్రమని తెలిసి కూడా గాలిలో ఎగురనిస్తున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత రెండు దశాబ్దాలలో ఈ శ్రేణి విమానాలు ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 ప్రమాదాలకు గురయ్యాయి. వేలాది మంది ప్రాణాలను బలిగొన్న ఈ విమానం కథాకమీమామిషు ఏంటో వివరంగా చూద్దాం.

మహారాష్ట్ర రాజకీయ ఉద్ధండుడు అజిత్ పవార్ ప్రయాణించిన లియర్ జెట్ 45 విమానం ఒకప్పుడు బిజినెస్ టైకూన్స్, రాజకీయ నాయకులకు అత్యంత ఇష్టమైన వాహనం. కెనడాకు చెందిన బాంబార్డియర్ ఏరోస్పేస్ దీనిని నిర్మించింది. 1990వ దశకం చివరలో మార్కెట్లోకి వచ్చిన ఈ విమానం, వేగంగా ప్రయాణించి సమయాన్ని ఆదా చేయడంలో నంబర్ వన్ అనిపించుకుంది. సుమారు 800 నుంచి 850 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ జెట్, చిన్న చిన్న విమానాశ్రయాల్లో కూడా సులువుగా ల్యాండ్ అవ్వగలదు. అందుకే బిజీగా ఉండే నేతలు దీనిని ఎక్కువగా ఎంచుకుంటారు.

విస్మయానికి గురిచేసే విషయం ఏమిటంటే.. ఈ కేటగిరీకి చెందిన విమానాలు ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 200 కంటే ఎక్కువ సార్లు ప్రమాదాలకు గురయ్యాయి. వందల మంది వీఐపీలు, పైలట్లు ఇందులో ప్రాణాలు కోల్పోయారు. ఈ వరుస ప్రమాదాలు మరియు సాంకేతిక లోపాల కారణంగా సదరు కంపెనీ 2021లోనే దీని తయారీని పూర్తిగా నిలిపివేసింది. ఐదు సంవత్సరాల క్రితమే తయారీ ఆగిపోయినప్పటికీ, పాత విమానాలకు సర్వీసింగ్ చేస్తూ ఇప్పటికీ చాలా కంపెనీలు వీటిని అద్దెకు ఇస్తున్నాయి. అజిత్ పవార్ ప్రయాణించిన విమానం కూడా ఢిల్లీకి చెందిన వీఎస్ఆర్ వెంచర్స్ అనే ప్రైవేట్ సంస్థది.

లియర్ జెట్ 45 లోపల రాజసం ఉట్టిపడుతుంది. ఆరు నుంచి ఎనిమిది మంది ప్రయాణించేలా క్లబ్ సీటింగ్ ఉంటుంది. అంటే సీట్లు ముఖాముఖిగా ఉంటాయి. మధ్యలో చిన్న నడవ ఉంటుంది. లోపల చిన్న రిఫ్రెష్‌మెంట్ ఏరియా, వాష్‌రూమ్ కూడా ఉంటాయి. వేగం, సౌకర్యానికి పెట్టింది పేరు కావడంతో దీనికున్న బ్యాడ్ ట్రాక్ రికార్డును చాలా మంది గమనించరు. ఒకవేళ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోతే మాత్రం ఇది గాలిలో ఎగిరే బాంబులా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు.

భారత్‌లో ప్రతి విమానం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వద్ద రిజిస్టర్ అయి ఉండాలి. అజిత్ పవార్ ప్రమాదానికి గురైన విమానం నంబర్ VT-SSK. సాధారణంగా విమానం తయారీ ఆగిపోయిన తర్వాత కూడా, దాని విడిభాగాలు అందుబాటులో ఉంటే మెయింటెనెన్స్ చేసి నడపవచ్చు. బాంబార్డియర్ కంపెనీ సర్వీసింగ్ సదుపాయాన్ని కొనసాగిస్తుండటంతో, విఎస్ఆర్ వెంచర్స్ వంటి ఆపరేటర్లు దీనిని వాడుతున్నారు. కానీ, ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా పాత మోడళ్లను ఎందుకు ప్రోత్సహిస్తున్నారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. అజిత్ పవార్ మరణం తర్వాతైనా పాత చార్టర్డ్ విమానాల భద్రతపై కఠిన నిబంధనలు వస్తాయని ఆశిద్దాం.

Tags:    

Similar News