Rajiv Kumar: మంగళవారం ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పదవీ విరమణ
కొత్త సీఈసీగా జ్ఞానేశ్ కుమార్?;
భారత ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వచ్చే మంగళవారం పదవీ విరమణ చేయనున్నారు. ఆయన పదవీ కాలం మూడు రోజుల్లో పూర్తవుతుంది. దీంతో కొత్త ఎన్నికల కమిషనర్ ఎవరన్నది ఆసక్తి రేపుతోంది. రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలో లోక్‌సభ ఎన్నికలు, అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఆయన ఆధ్వర్యంలోనే జరిగాయి. అయితే పదవీ విరమణ తర్వాత కొన్ని నెలల పాటు హిమాలయాల్లోనే గడుపుతానని ఇటీవలే ఆయన ప్రకటించారు.
ఇదిలా ఉంటే వచ్చే సోమవారం కొత్త సీఈసీ ఎంపిక చేసే కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో కొత్త భారత ఎన్నికల కమిషనర్‌ను ఎంపిక చేయనున్నారు. ఇక ఈ ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అనంతరం వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలు కొత్త సీఈసీ ఆధ్వర్యంలోనే జరగనున్నాయి. త్వరలోనే కొత్త సీఈసీని ప్రకటించబోతున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.
ఇక కొత్త సీఈసీని ఎంపిక చేసే కమిటీలో ప్రధాని మోడీ, కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘల్, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ సభ్యులు కొత్త సీఈసీని ఎంపిక చేయనున్నారు.మొత్తం 480 మంది ఈ పోస్టుకు పోటీ పడుతుండగా సెర్చ్ కమిటీ అయిదుగురి పేర్లను ఎంపిక కమిటీకి సిఫారసు చేయనున్నట్టు సమాచారం. వీరిలో జ్ఞానేశ్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. ఈ నెల 17న జరిగే సమావేశంలో ప్రధాని మోదీ, న్యాయశాఖ మంత్రి మేఘ్వాల్, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ కలిసి కొత్త సీఈసీని ఎంపిక చేస్తారు. 1988 బ్యాచ్‌కు చెందిన జ్ఞానేశ్ కుమార్ సహకార శాఖ కార్యదర్శిగా నిరుడు జనవరి 31న రిటైర్డ్ అయ్యారు.
రాజీవ్ కుమార్.. మే 15, 2022న 25వ సీఈసీగా బాధ్యతలు స్వీకరించారు. బీహార్/జార్ఖండ్ కేడర్‌కు చెందిన 1984-బ్యాచ్ ఐఏఎస్ అధికారి. పేద పిల్లలకు బోధించడం ద్వారా సమాజానికి తిరిగి ఇవ్వాలనే వ్యక్తిగత కోరిక ఉన్నట్లు ఆయన తెలిపారు. రాజీవ్ పదవీ కాలంలో 2022లో 16వ రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలతో పాటు 11 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం ఒక మైలురాయి. ఇక ఎన్నికల కమిషనర్‌గా రాకముందు ఫైనాన్స్ సెక్రటరీ మరియు పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్ ఛైర్మన్‌తో సహా అనేక కీలక పదవులు నిర్వహించారు. ఆర్థిక కార్యదర్శిగా బ్యాంకుల విలీనాలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల మూలధనీకరణ మరియు షెల్ కంపెనీలపై అణిచివేత వంటి ముఖ్యమైన సంస్కరణలకు ఆయన నాయకత్వం వహించారు.