భారత్ నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ను జీర్ణించుకోలేని పాకిస్థాన్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. దాంతో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దయ్యాయి. అలాగే ఇండియా గేట్ వద్ద పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని స్థానికులకు హెచ్చరికలు జారీ చేశారు.
అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేలా వైద్య, విపత్తు నిర్వహణ విభాగాల సంసిద్ధతను సమీక్షిస్తున్నారు. పోలీసులు అత్యంత అప్రమత్తంగా ఉన్నారు. రాత్రిపూట నిఘా ముమ్మరం చేశారు. సున్నితమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరిస్తున్నామన్నారు. . ఆపరేషన్ సిందూర్ దృష్ట్యా దేశంలో పలు విమానాశ్రయాలను మూసివేశారు. అలాగే ఢిల్లీకి రాకపోకలు సాగించే పలు విమానాలు నిలిచిపోయాయి .
వైద్యులు, ఆసుపత్రులకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌కు చెందిన మహారాష్ట్ర విభాగం ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర సేవలు అందించేవిధంగా సిద్ధంగా ఉండాలని సూచించింది. లైఫ్ సేవింగ్స్ ఇక్విప్‌మెంట్, మెడిసన్స్ , బెడ్స్, సిద్ధంగా ఉండేలా చూసుకోవాలని తన ఆదేశాల్లో పేర్కొంది. చాలావరకు రాష్ట్రాలు ఇదేతరహా ఆదేశాలు జారీ చేస్తున్నాయి.