చంద్రయాన్-3 ప్రయోగానికి వేగంగా అడుగులు
పేలోడ్‌ను రాకెట్‌తో అనుసంధానించిన శాస్త్రవేత్తలు... ప్రత్యేక వాహనంలో సతీశ్ ధావన్ సెంటర్‌కు కాప్స్యూల్... చంద్రయాన్ -3 స్పేస్ క్రాఫ్ట్ బరువు 3,900 కిలోలు;
చంద్రయాన్ 3 ప్రయోగానికి అడుగులు వేగంగా పడుతున్నాయి. ఈ నెల 13న ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా ఈ ప్రయోగాన్ని చేపడుతోంది. దీనికి సంబంధించిన పనులు వేగవంతం అయ్యాయి. చంద్రయాన్ -3కి చెందిన పేలోడ్‌ను LVM3 రాకెట్‌తో అనుసంధానం చేశారు. సతీశ్ ధావన్ సెంటర్‌లో రాకెట్ కు చంద్రయాన్ కాప్స్యూల్ ను అనుసంధానం చేశారు. వీటికి సంబంధించిన వీడియోలను ఇస్రో తన ట్విట్టర్ ఖాతాలో విడుదల చేసింది. చంద్రయాన్ -3 స్పేస్ క్రాఫ్ట్ సుమారు 3 వేల 9 వందల కేజీల బరువు ఉంటుంది. బెంగళూరులోని UR రావు శాటిలైట్ సెంటర్ నుంచి ఈ కాప్స్యూల్‌ను ప్రత్యేక వాహనంలో సతీశ్ ధావన్ సెంటర్‌కు తరలించారు. రాకెట్ పైభాగంలో ఉన్న పేలోడ్ లో ల్యాండర్ , రోవర్ ఉంటాయి.
జాబిల్లి అన్వేషణ కోసం ఇస్రో చంద్రయాన్-3 ప్రయోగాన్ని చేపట్టనుంది. జులై 13న ఈ ప్రయోగం చేపట్టనున్నట్లు ఇప్పటికే ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ అధికారికంగా వెల్లడించారు. జులై 13 న ఫస్ట్ డేట్‌గా చెప్పిన ఆయన అప్పటి నుంచి 19వరకూ సరైన టైమ్ చూసి చంద్రయాన్ 3 ని ప్రయోగిస్తామని స్పష్టం చేశారు. ఈసారి చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్‌లాండింగ్‌లో విజయవంతమవుతామని విశ్వాసం వ్యక్తం చేశారు. తొలి రోజే ప్రయోగం చేపట్టాలని భావిస్తున్నామని.. కానీ సరైన టైమ్ చూసిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని సోమనాథ్ తెలిపారు.
చంద్రయాన్ సిరీస్‌లో ఇది మూడో ప్రయోగం. GSLV M-3 భారీ వాహకనౌక ద్వారా ఈ ప్రయోగం చేపట్టనున్నారు. ప్రస్తుతం ఈ ప్రయోగ పనులు చివరి దశకు చేరుకున్నాయి. చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యేలా దీన్ని చేపట్టనున్నారు. ల్యాండర్-రోవర్ కాంబినేషన్‌తో దీన్ని ప్రయోగించనున్నారు. ఇప్పటికే చంద్రయాన్ 2లో ప్రయోగించిన ఆర్బిటర్ చంద్రుడి చుట్టూ కక్ష్యలో తిరుగుతోంది. అదే ఆర్బిటర్‌ను చంద్రయాన్ 3కి వినియోగించుకోనున్నారు. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా దేశాలు చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా తమ వాహకనౌకలను ల్యాండ్ చేయగలిగాయి. ఈ మైలురాయిని సాధించిన నాలుగో దేశంగా అవతరించాలని భారత్ ప్రయత్నిస్తోంది. చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని ఆవిష్కరించడమే లక్ష్యంగా 2019లో చంద్రయాన్-2 ప్రయోగాన్ని చేపట్టింది. అయితే చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్‌ల్యాండింగ్ సమయంలో విఫలమైంది. అయినప్పటికీ ఎనిమిది సాంకేతిక పరికరాలతో కూడిన ఆర్బిటర్ మాత్రం ఇంకా కక్ష్యలో విజయవంతంగా తిరుగుతోంది.