Fact Check : మీ అకౌంట్లో రోజుకు రూ.85 వేలు..ప్రభుత్వం అదిరిపోయే స్కీమ్.. నిజమేనా ?
Fact Check : రోజుకు 85 వేల రూపాయల సంపాదన.. అది కూడా ఏ కష్టమూ లేకుండా.. వినడానికి చాలా ఆశగా ఉంది కదూ? సరిగ్గా ఇదే ఆశను పెట్టుబడిగా మార్చుకుని కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫోటోలు, వీడియోలను వాడుకుంటూ భారీ మోసానికి తెరలేపారు. ఈ ప్రకటనల వెనుక ఉన్న అసలు నిజం ఏంటో భారత ప్రభుత్వం బయటపెట్టింది.
ప్రస్తుతం ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో కొన్ని స్పాన్సర్డ్ ప్రకటనలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇందులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా ఒక ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ గురించి వివరిస్తున్నట్లు కనిపిస్తుంది. కేవలం ఒక్క రోజులోనే 85 వేల రూపాయలు సంపాదించవచ్చని ఆ వీడియోలో పేర్కొన్నారు. దీనిని చూసిన సామాన్యులు, మంత్రి గారే చెబుతున్నారు కదా అని గుడ్డిగా నమ్మి తమ కష్టార్జితాన్ని కేటుగాళ్ల చేతుల్లో పెడుతున్నారు. అయితే ఈ వీడియో పూర్తిగా నకిలీదని భారత ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ ఏజెన్సీ స్పష్టం చేసింది.
ఈ ప్రకటనల్లో వాడుతున్న వీడియోలు అసలైనవి కావు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వాడి సృష్టించిన డీప్‌ఫేక్ వీడియోలు. అంటే నిర్మలా సీతారామన్ ముఖాన్ని, ఆమె గొంతును డిజిటల్ పద్ధతిలో మార్చి, ఆమె చెప్పని మాటలను ఆమె చెప్పినట్టుగా భ్రమ కల్పిస్తున్నారు. ఇలాంటి మోసపూరితమైన పెట్టుబడి పథకాలతో కేంద్ర ప్రభుత్వానికి గానీ, ఆర్థిక మంత్రికి గానీ ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది.
https://x.com/PIBFactCheck/status/2008838027582566447?ref_src=twsrc^tfw|twcamp^tweetembed|twterm^2008838027582566447|twgr^eaffb165fe43d24e10c3f00df353d66a72ffb704|twcon^s1_&ref_url=https://www.tv9hindi.com/business/claiming-to-earn-85000-rupees-24-hours-pib-fact-check-investment-scheme-3640200.html
ఇలాంటి ఘోరాలు జరగడం ఇదేం మొదటిసారి కాదు. కొద్ది రోజుల క్రితం కేవలం 22 వేల రూపాయలు పెట్టుబడి పెడితే నెలకు 10 లక్షలు వస్తాయంటూ కొందరు నకిలీ వీడియోలను వైరల్ చేశారు. అప్పట్లో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ఫోటోలను కూడా దుర్వినియోగం చేశారు. ఎంత పెద్ద పదవిలో ఉన్న వారి ఫోటోలు వాడినా, అసాధారణమైన లాభాలు వస్తాయంటే అది ఖచ్చితంగా మోసమేనని గ్రహించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ తరహా సైబర్ నేరాల బారిన పడకుండా ఉండాలంటే ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. సోషల్ మీడియాలో కనిపించే తెలియని లింక్‌లను క్లిక్ చేయకూడదు. ముఖ్యంగా మీ బ్యాంక్ వివరాలు, ఓటీపీ, పిన్ నంబర్లు వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోకూడదు. ఏదైనా పథకంలో పెట్టుబడి పెట్టే ముందు అధికారిక వెబ్‌సైట్లకు వెళ్లి వివరాలు సరిచూసుకోవాలి. ఎవరైనా మిమ్మల్ని తక్కువ కాలంలో కోటీశ్వరులను చేస్తామని వాగ్దానం చేస్తే, వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయండి.