ఎస్సీ, ఎస్టీ సహా అణగారిన వర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు ప్రధాని మోదీ ( Narendra Modi ). కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీల వ్యతిరేక పార్టీ అని అంబేడ్కర్ చెప్పారని, నెహ్రూ ప్రభుత్వ విధానాలు నచ్చక ఆయన రాజీనామా చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అంబేడ్కర్‌ను ఓడించిందని విమర్శించారు. జగ్జీవన్‌రామ్ ప్రధాని కాకుండా ఆ పార్టీ అడ్డుకుందన్నారు. రిజర్వేషన్లకు కాంగ్రెస్ మొదటి నుంచి వ్యతిరేకమన్నారు.
కాంగ్రెస్ ప్రతిపక్షంలోనే కూర్చోవాలని ప్రజలు మరోసారి తీర్పునిచ్చారు. వరుసగా మూడు సార్లు ఆ పార్టీ 100 మార్క్ దాటలేదు. ఇన్నిసార్లు ఓడినా వారిలో ఎలాంటి మార్పు రాలేదు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో ప్రతిపక్ష నేతలకు అర్థం కావట్లేదు. 99 సీట్లు వచ్చాయని కాంగ్రెస్ నేతలు మిఠాయిలు పంచుకుంటున్నారు. కాంగ్రెస్‌కు వందకు 99 సీట్లు రాలేదు. 543లో 99 వచ్చాయి. వారి స్ట్రైక్ రేట్ 26శాతం మాత్రమే. ప్రజా తీర్పును వారు ఇకనైనా గౌరవించాలి అని మోదీ దుయ్యబట్టారు.
హిందువులపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదని ప్రధాని మోదీ అన్నారు. దీనిని సమర్థించేందుకు కుట్ర జరుగుతోందని, ఇది తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని తెలిపారు. ‘కాంగ్రెస్ హిందూ ఉగ్రవాదం వంటి పదాలను ఉపయోగించింది. గతంలో వారి మిత్రపక్షం హిందూ మతాన్ని డెంగీతో పోల్చింది. ఈ దేశం వీరిని ఎప్పటికీ క్షమించదు. విపక్ష నేతల ప్రవర్తన సభ హుందాతనానికి మంచిది కాదు’ అని మండిపడ్డారు.