Ayyappa Devotees Bus Accident : ఘోర ప్రమాదం.. అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా
హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన అయ్యప్ప స్వాములు ప్రయాణిస్తున్న బస్సు బోల్తా కొట్టింది. కేరళలోని కొట్టాయం కనమల అట్టివలం వద్ద బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో సైదాబాద్‌కు చెందిన బస్సు డ్రైవర్ రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో ఉన్న 8 మంది తీవ్రంగా గాయపడగా, మరో 30 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కొట్టాయం నుంచి శబరిమలకు వెళ్తుండగా పంబానదికి 15 కిలోమీటర్ల దూరంలోని ఘాట్ రోడ్డులో బస్సు బోల్తా పడింది. బస్సు ఘాట్ రోడ్డులోని మూల మలుపు వద్ద కిందకు దిగుతుండగా అదుపు తప్పినట్లు స్థానికులు చెబుతున్నారు. పక్కన చెట్లు ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పిందని బాధితులు తెలిపారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కొట్టాయం మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ రాజు మృతదేహాన్ని పంపాడి తాలూకా ఆసుపత్రిలో భద్రపరిచారు. రాజు హైదరాబాద్‌లోని సైదాబాద్ ఏకలవ్య నగర్ కు చెందిన వ్యాక్తిగా తెలుస్తోంది.