Child Care Leave: ఇక వారికి 730 రోజులు సెలవులు

శిశు సంరక్షణ సెలవులపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన... ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపుపై కూడా....;

Update: 2023-08-10 04:45 GMT

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల (Government Employees) శిశు సంరక్షణ సెలవులపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. మహిళలు, ఒంటరి పురుష ప్రభుత్వ ఉద్యోగులు 730 రోజులు చైల్డ్‌ కేర్‌ లీవ్స్ ‌(Child Care Leave)కు అర్హులని కేంద్రం పార్లమెంట్‌లో తెలిపింది. కేంద్ర వ్యవహారాలకు సంబంధించి సివిల్ సర్వీసెస్, ఇతర విభాగాల్లో నియమితులైన మహిళా, ఒంటరి పురుష ప్రభుత్వ ఉద్యోగులు సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ ప్రకారం చైల్డ్ కేర్ లీవ్ (CCL)కి అర్హులని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ (Jitendra Singh) పార్లమెంట్‌లో లిఖితపూర్వకంగా తెలిపారు. మొదటి ఇద్దరు పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకూ వారి సంరక్షణ కోసం మొత్తం సర్వీసులో గరిష్టంగా 730 రోజులు సెలవు తీసుకోవచ్చని కేంద్రం తెలిపింది. దివ్యాంగులైన పిల్లల విషయంలో మాత్రం వయోపరిమితి లేదని చెప్పారు.


మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచనున్నారనే వార్తలపై కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. రిటైర్మెంట్ వయస్సును మార్చబోమని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచడం గానీ, తగ్గించడం గానీ ఉండదని జితేంద్ర సింగ్ తెలిపారు. గత మూడేళ్లలో 122 మంది ఉద్యోగులు నిర్బంధ పదవీవిరమణ చేశారని లోక్‌సభ సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్రం ఈ మేరకు సమాధానం ఇచ్చింది. యంత్రాంగాన్ని బలోపేతం చేసే దిశగా డిజిటలైజేషన్, ఎలక్ట్రానిక్ వినియోగం, రూల్స్‌ను సరళించడం వంటి మార్పులు చేసినట్లు పేర్కొంది.

Tags:    

Similar News