సెంట్రల్ కోల్ కతాలోని ఓ హోటల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 14 మంది సజీవ దహనమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్సలు చేయిస్తున్నారు. కోల్ కతాలోని బుర్రాబజార్ ఏరియాలోని ఫల్పట్టి మచ్చువా అనే పండ్ల మార్కెట్ సమీపంలో ఉన్న రీతురాజ్ హోటల్లో ఈ ప్రమాదం జరిగింది. రాత్రి 8:15 గంటల ప్రాంతంలో రీతురాజ్ హోటల్లో మంటలు చెలరేగా యని కోల్కతా పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్ వర్మ తెలిపారు. 14 మృతదేహాలను వెలికితీశారు. చనిపోయిన వారిలో 11 మంది పురుషులు, ఒక మహిళ, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఇదిలా ఉండగా హోటల్ నుంచి దట్టమైన పొగలు రావడాన్ని స్థానికులు గమనించారు. పొగ కారణంగా అందులోని వారు భయంలో భవనంపైకి చేరినట్లు చెబుతున్నారు. సంజయ్ పాశ్వాన్ (40) అనే వ్యక్తి భయంతో పై నుంచి దూకి చనిపోయినట్లు తెలిపారు. డ్రెయిన్ పైప్ సాయంతో దిగేందుకు ప్రయత్నించిన మరో వ్యక్తి కాలు విరిగింది. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం కోల్ కతా మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. 10 ఫైర్ ఇంజిన్ తెల్లవారు జామున 3.30 గంటల వరకు సహాయక చర్యలు చేపట్టడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. మంటలను అదుపులోకి తెచ్చామని, సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని ఆయన తెలి యజేశారు. మరోవైపు, జరిగిన ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.